దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ఆ గుర్తు కారణమా ?

Dubbaka By Election: దుబ్బాక ఉప ఎన్నికల్లో అచ్చం కారును పోలినట్టుగా ఉండే రొట్టె పీట గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర్య తమకు రావాల్సిన ఓట్లు పడ్డాయేమో అని టీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

news18-telugu
Updated: November 10, 2020, 11:10 PM IST
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ఆ గుర్తు కారణమా ?
కారును పోలిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు
  • Share this:
దుబ్బాకలో హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌లో విజయం చివరకు బీజేపీనే వరించింది. వెయ్యి ఓట్లకుపైగా మెజార్టీతో బీజేపీ, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం.. చివరకు బీజేపీని వరించి అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. ఈ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్న టీఆర్ఎస్... హోరాహోరీగా సాగిన ఈ పోటీలో తమ ఓటమికి ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించిన గుర్తు కూడా కారణం కావొచ్చని అనుమానిస్తోంది. దుబ్బాకలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగిన బండారు నాగరాజుకు మొత్తం 3489 ఓట్లు వచ్చాయి. అతడికి ఎన్నికల్లో కేటాయించిన గుర్తు రొట్టెలు చేసే పీట.

అయితే ఈ గుర్తు అచ్చం కారును పోలినట్టుగా ఉండటంతో.. తమకు రావాల్సిన ఓట్లు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి పడ్డాయేమో అని టీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. అదే నిజమైతే... దుబ్బాకలో తమ పార్టీ ఓటమికి అదే ముఖ్యకారణమవుతుందని భావిస్తున్నాయి. దుబ్బాకలో పోటీ చేసిన స్వతంత్ర్య అభ్యర్థులందరిలోకి బండారు నాగరాజుకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.

Dubbaka by elections, car symbol, dubbaka new symbol, bjp win in dubbaka, telangana news, దుబ్బాక ఉప ఎన్నికలు, కారు గుర్తు, దుబ్బాకలో ఎన్నికల గుర్తు, తెలంగాణ న్యూస్
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులందరిలోనూ అత్యధిక ఓట్లు సాధించిన నాగరాజు


ఇలా కారును పోలిన గుర్తుతో తాము నష్టపోయామని టీఆర్ఎస్ ఆందోళన చెందడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలుసార్లు ఇతర గుర్తుల కారణంగా తాము ఓట్లు నష్టపోయామని టీఆర్ఎస్ భావించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు కారణంగా తాము ఓట్లు నష్టపోయామని భావించి ఆ గుర్తును లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తు టీఆర్ఎస్‌కు కొంతమేర నష్టం చేసింది. ఆ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు కారణంగా భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి చవిచూసిందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది.

అయితే తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కారును పోలిన గుర్తు ఒకటి ఉండటం.. దానికి ఏకంగా 3489 ఓట్లు రావడం టీఆర్ఎస్‌ను నిరాశకు గురి చేసింది. కారును పోలిన గుర్తుల కారణంగా గతంలో పలుసార్లు ఎన్నికల్లో నష్టపోయిన తమకు.. మరోసారి ఆ రకమైన గుర్తు నష్టపరిచిందనే టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: November 10, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading