Telangana: కరోనా చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి.. గవర్నర్ కు లేఖ రాసిన బండి సంజయ్..

బండి సంజయ్ కుమార్ (ఫైల్)

Telangana: కరోనా కాలంలో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

  • Share this:
    కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఫలితంగానే ఈ వ్యాధి విస్తరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపిందని.. ఫలితంగా పేదలకు కరోనా కష్టాలు మరింత పెరిగాయని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు, గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారని.. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ‘ఆయుష్మాన్ భారత్’లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్టు ‘ఆరోగ్య శ్రీ’ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా కరోనాను ‘ఆరోగ్య శ్రీ’లో చేర్చాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.

    బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాదాపు ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయకపోవడానికి గల కారణమేంటని ఆ లేఖలో సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. 30 డిసెంబర్ 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని చెప్పారని.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం బాధాకారమని అన్నారు.

    ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, అలాగే వెంటనే ఆలస్యం చేయకుండా తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గవర్నర్ కు రాసిన లేఖలో బండి సంజయ్ కుమార్ పొందుపరిచినట్లు తెలిపారు.
    Published by:Veera Babu
    First published: