IN FIRST PHASE 91 LOK SABHA SEATS GOING TO POLLS ON APRIL 11 NK
నేడు 91 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవీ ప్రత్యేకతలు
ప్రతీకాత్మక చిత్రం
Lok Sabha Elections 2019 : మొత్తం 91 సీట్లకు ఎన్నికలు జరగనుండగా... తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలకూ పోలింగ్ ఉంటోంది. 20 రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నెల కిందట కేంద్ర ఎన్నికల సంఘం... ప్రకటన చెయ్యగానే... పార్టీలు, నేతలు ఉరుకులు-పరుగులు పెట్టారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులు, రెబెల్స్ అలకలు, పార్టీల జంపింగ్‌లు అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రచార హోరు మామూలుగా సాగలేదు. ఇక ఇప్పుడు మనీ, మద్యం ఏ స్థాయిలో పంపిణీ అవుతోందో తెలుసుకుంటూనే ఉన్నాం. పోలీసుల తనిఖీల్లో దొరుకుతున్నది కొంతే... తెరవెనక జరుగుతున్న సరఫరా కొండంత అన్నది మనకు తెలిసిన విషయమే. కొన్నిచోట్ల డబ్బుకు బదులు రూ.10 నోటు ఇచ్చి, దానిపై సీరియల్ నంబర్ ను నోట్ చేసుకుంటున్నారు. తనకు ఓటు వేస్తే, తాను గెలిస్తే ఆ సీరియల్ నంబర్ ఆధారంగా డబ్బు ఇస్తామని డీల్ కుదుర్చుకుంటున్నారు. ఇలాంటి డీల్ కుదుర్చుకున్నవారిని అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సరే... నేటి ఎన్నికల ప్రత్యేకతల్ని ఓసారి చకచకా తెలుసుకుందాం.
నేటి తొలి దశ పోలింగ్ విశేషాలు :
* 17వ లోక్ సభకు ఎన్నికలు జరగబోతున్నాయి.
* మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ తొలి దశ.
* 20 రాష్ట్రాల్లోని 91 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.
* ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), సిక్కిం (1), మేఘాలయ (2), మిజోరాం (1), నాగాలాండ్ (1), అండమాన్ నికోబార్ (1), లక్షద్వీప్ (1) లోని అన్ని లోక్ సభ సీట్లకూ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి.
* ఉత్తరప్రదేశ్ (8), బిహార్ (4), బెంగాల్ (2), ఒడిషా (4), అసోం (5), ఛత్తీ్స్గఢ్ (1), జమ్మూకాశ్మీర్ (2), మహారాష్ట్ర (7), మణిపూర్ (1), త్రిపుర (1)కి కూడా గురువారమే పోలింగ్ జరగబోతోంది.
* ఆంధ్రప్రదేశ్తోపాటూ ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు పూర్తి స్థానాల్లో, ఒడిశా అసెంబ్లీలోని కొన్ని స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
* ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. కాబట్టి... తొలిదశ ఎన్నికల్లో ఓటు వేసిన వారు... ఫలితం తెలుసుకునేందుకు 40 రోజులకు పైగా ఎదురుచూడక తప్పదు.
* ఛత్తీ్‌స్‌గఢ్‌లో 512 పోలింగ్ కేంద్రాల్ని సమస్యాత్మకమైనవిగా, 224 కేంద్రాల్ని అత్యంత సమస్యాత్మకమైనవిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
* మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న 72 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో :
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 175
* ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ స్థానాల సంఖ్య 25
* ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2118 మంది పోటీలో ఉన్నారు.
* ఏపీ లోక్‌సభ ఎన్నికల బరిలో 319 మంది పోటీలో ఉన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,920
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 9,000
* ఎన్నికలకు పోలీస్ బలగాలు 1,20,000
* ఎన్నికల సిబ్బంది 3,00,000
* ఏపీలో మొత్తం ఓటర్లు 3,93,45,717. వారిలో మగాళ్లు 1,83,24,588 మంది, ఆడవాళ్లు 1,86,04,742 మంది. ట్రాన్స్ జెండర్స్ 3,761 మంది. సర్వీసు ఓటర్లు- 56,908, ప్రవాసాంధ్ర ఓటర్లు 5,323, దివ్యాంగ ఓటర్లు- 5,27,734
* ఏపీలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 10,15,219.
* ఏపీలో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో... :
* తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
* నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
* నిజామాబాద్ నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు 2 గంటల పాటూ (ఉదయం 6-8 మధ్య) మాక్ పోలింగ్ ఉంటుంది.
* తెలంగాణలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది.
* 17 స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు.
* తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయబోతున్న వారి సంఖ్య 2,97,08,599కు చేరింది.
* తెలంగాణలో 34,604 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
* తెలంగాణలో 2.5 లక్షల మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
* ఈసారి 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్లను ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు.
పోలింగ్ కేంద్రం ఎక్కడ :
* 9223166166 నంబర్‌కు TS VOTE VOTERID NO టైప్ చేసి SMS పంపితే మొబైల్ ఫోన్‌కు పోలింగ్ కేంద్రం అడ్రస్ వస్తుంది. (ఉదాహరణకు ‘ TS VOTE AB-C2560001).
- 1950 నంబర్‌కు ECI VOT-ER-ID N టైప్ చేసి SMS పంపి తెలుసుకో వచ్చు. (ఉదాహరణకు ECI ABC-2560001).
- స్మార్ట్ ఫోన్లో నాఓట్ (Naa Vot-e) యాప్‌ను డౌన్లోడ్ చేసి ఏరియా మ్యాప్ ద్వారా లొకేషన్ చెక్‌చేసుకోవచ్చు.
- 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన చోటే... ఇప్పుడూ ఓటు వేసే అవకాశాలుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.