రైతులు అందరికీ పీఎం కిసాన్ పథకం వర్తింపు.. మోదీ 2.0 కేబినెట్ సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రైతులు, చిరువ్యాపారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 9:15 PM IST
రైతులు అందరికీ పీఎం కిసాన్ పథకం వర్తింపు.. మోదీ 2.0 కేబినెట్ సంచలన నిర్ణయం
మోదీ కేబినెట్ సమావేశం (Image:Twitter)
news18-telugu
Updated: May 31, 2019, 9:15 PM IST
నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికంటే ప్రధానంగా పీఎం కిసాన్ పథకాన్ని రైతులు అందరికీ విస్తరించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్టు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు తెలిపారు. గతంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ పథకం ప్రారంభమైంది. రెండు దఫాల చెక్కులు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. కొత్తగా రైతులు అందరినీ ఈ పథకంలోకి తీసుకురావడం ద్వారా మరో రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి జరగనుంది. మొత్తం లబ్దిదారుల సంఖ్య 14.5కోట్లకు చేరుతుంది. ఈ పథకానికి 2019-20 సంవత్సరంలో 87,217 కోట్ల ఖర్చు కావొచ్చని అంచనా.

దీంతోపాటు పీఎం కిసాన్ పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చిన్న, మధ్యతరహా రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు రైతులు నెలకు కొంత మొత్తం జమ చేస్తూ పోతే 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారికి నెలకు రూ.3వేలు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.10,774 కోట్లు ఖర్చు చేయనుంది.

ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకల్లో వచ్చే కాళ్లు, నోటికి సంబంధించిన వ్యాధులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మిషన్ ప్రారంభించింది. ఈ పధకం కోసం కేంద్రం రూ.13వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

చిరు వ్యాపారుల కోసం పెన్షన్ స్కీమ్‌‌ తీసుకొచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం వల్ల మూడు కోట్ల మందికి లబ్ధి జరుగుతుందని అంచనా. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యనున్న వారు అర్హులు. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారికి నెలకు కనీసం రూ.3వేలు పెన్షన్ లభిస్తుంది.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...