IF TELANGANA CM KCR OPT FOR CABINET RESHUFFLE THEN HE MAY NOT GO FOR EARLY POLLS FOR ASSEMBLY AK
K Chandrashekar: కేసీఆర్ ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే.. ఇక ముందస్తు ఎన్నికలు ఉండవా ?
కేసీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana Politics: రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను కేసీఆర్ ఎమ్మెల్సీగా చేసింది కూడా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడానికే అనే చర్చ కూడా జరుగుతోంది. కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారనే వాదన కూడా ఉంది.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వరి కొనుగోలు వ్యవహారం తరువాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో రాజకీయంగా మరింతగా తలపడే అవకాశం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ మీదే నెలకొంది. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసే విషయంలో తనదైన వ్యూహాలను అమలు చేయడం సీఎం కేసీఆర్ ప్రత్యేకత. అయితే బీజేపీ విషయంలో ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయన్నది తేలాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో తమకు కొంత సానుకూలత కనిపించడంతో టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కూడా తనదైన శైలిలో వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇవన్నీ ఎలా ఉన్నా.. సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడం ద్వారా తెలంగాణ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఇక ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులను తప్పించి.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని.. ఇందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే 2021 ముగియనుండటంతో.. కేసీఆర్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ 2022లో ఉంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే జరిగితే వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలు చాలా తక్కువ అనే టాక్ ఉంది. కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉండే ప్రభుత్వం కోసం కేసీఆర్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తే మాత్రం.. ఆయన విపక్షాలు అంచనా వేస్తున్నట్టుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేనట్టే అని భావించాల్సి ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగితే తమకు అవకాశం ఉంటుందని పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలావరకు ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను కేసీఆర్ ఎమ్మెల్సీగా చేసింది కూడా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడానికే అనే చర్చ కూడా జరుగుతోంది. కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారనే వాదన కూడా ఉంది. మొత్తానికి కేసీఆర్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు, ముందస్తు ఎన్నికలకు కచ్చితంగా లింక్ ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.