ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఢంకా మోగించాయి. బీజేపీ నేతలు కూడా తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టి పారేస్తున్నారు. ఇంకోవైపు, హంగ్ వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లాంటి వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంటే రెండు కీలక పార్టీలు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నాయి. 2014 ఎన్నికల్లో తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయేలో చేరకపోయినా బయటినుంచే జయలలిత మద్దతు ఇచ్చారు. 2017లో ఎన్డీయేలో చేరిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరలేదు. అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బీజేపీతో కలిసి పోటీ చేశాయి. బిహార్ లోక్‌సభ సీట్లలో 22 సీట్లలో జేడీయూ, 18 సీట్లలో బీజేపీ పోటీ చేశాయి.
తమిళనాడులో మొత్తం 39 సీట్లు ఉండగా బీజేపీ 5 చోట్ల, అన్నాడీఎంకే 27 సీట్లలో, మిగతా చోట్ల మిత్ర పక్షాలు పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, జేడీయూ అభ్యర్థులు గెలిచి, ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే కేంద్ర కేబినెట్లో ఈ రెండు పార్టీలు చోటు దక్కించుకోనున్నాయి. మిత్రపక్షాలకు బీజేపీ ఇచ్చిన విందు సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. మోదీ సర్కారు మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నామని చెప్పారు. ఆ ప్రభుత్వంలో మిత్ర పక్షాల భాగస్వామ్యం ఉంటుందని వ్యాఖ్యానించారు.
అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను వ్యతిరేకించిన అన్నాడీఎంకే నేతలు.. ఫలితాలు దేశ ప్రజల మైండ్‌సెట్‌ను ప్రతిబింబం చేస్తాయని తెలిపారు. ఎన్డీయే కేబినెట్లో చేరతారా? అని ఆ పార్టీ నేత పన్నీర్ సెల్వంను ప్రశ్నించగా.. ఫలితాలు విడుదలయ్యాక పార్టీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.