KTR - Harish Rao: కేటీఆర్ సీఎం అయితే.. హరీష్‌కు దక్కబోయే పదవి ఇదేనా?

కేటీఆర్, హరీష్ రావు

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు పరిస్థితి ఏంటనే చర్చ తెలంగాణ భవన్‌లో మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుగుదల, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ముందు నుంచి కేసీఆర్ వెనుక ఉన్న హరీష్ రావుకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేశారని చెబుతున్నారు. ఫిబ్రవరి 18న రథసప్తమి నాడు కేటీఆర్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగబోతోందని, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలను కుమారుడు కేటీఆర్‌కు ఆ రోజే అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో హరీష్ రావు పరిస్థితి ఏంటనే చర్చ తెలంగాణ భవన్‌లో మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుగుదల, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ముందు నుంచి కేసీఆర్ వెనుక ఉన్న హరీష్ రావుకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణభవన్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే హరీష్ రావుకు పార్టీకి సంబంధించిన పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది.

    ప్రస్తుతం కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి హరీష్ రావుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హరీష్ రావుతో పాటు మరో ముఖ్య బీసీ నేత అయిన ఈటల రాజేందర్‌కు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వొచ్చని చెబుతున్నారు. హరీష్ రావు ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. కానీ, ఆయన బడ్జెట్ తయారీకి సంబంధించి కానీ, ఇతరత్రా పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఊహించని నిర్ణయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన కేసీఆర్ ఏం చేస్తారనేది ప్రధానాంశం. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ల గెలిచిన వెంటనే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు స్వయంగా కేటీఆర్.. హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. ఇప్పుడు మళ్లీ కేటీఆర్‌కు పట్టాభిషేకం అనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ఏం పదవి ఇస్తారనే చర్చ మొదలైంది.

    ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగింది. దుబ్బాకలో సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ కోల్పోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఆ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం హరీష్ రావు తీసుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అంతకు ముందు 99 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ కేవలం 56 సీట్లకు పరిమితం అయింది. బీజేపీ 48 సీట్లు దక్కించుకుంది. ఎంఐఎం 44 చోట్ల గెలుపొందింది. ఈ ఎన్నికలకు కేటీఆర్ ఇన్ చార్జి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: