Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad: ఒకవేళ బీఎస్పీ హుజూరాబాద్‌లో పోటీ చేస్తే.. అక్కడి అభ్యర్థి తరపున ప్రచారం చేసే బాధ్యత కూడా ప్రవీణ్ కుమార్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఆయన ఎక్కువగా టీఆర్ఎస్‌నే టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి.

  • Share this:
    హుజూరాబాద్‌ రాజకీయం మీదే ఇప్పుడు తెలంగాణ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు అక్కడ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటుంటే.. కాంగ్రెస్ ఇంకా హుజూరాబాద్ విషయంలో ముందడుగు వేయలేదు. ఇక అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్‌పై తాము ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది. హుజూరాబాద్‌లోనే దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రూ. 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరికొన్ని వందల కోట్ల నిధులను కూడా త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. హుజూరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లను తమ సొంతం చేసుకోవడానికే టీఆర్ఎస్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం తెలంగాణవ్యాప్తంగా దళితుల అభ్యున్నతి కోసమే ఈ పథకం తెచ్చామని చెబుతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే దళితులను తమ వైపు తిప్పుకోవడానికి టీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. దళితుల ఓట్లను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొచ్చిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం బీఎస్పీలోచేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు దళిత వర్గంలో మంచి ఆదరణ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆయన బీఎస్పీలో చేరేందుకు ఏర్పాటు చేసిన సభకు మంచి స్పందన రావడం కూడా రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో ఆయన చేసిన విమర్శలకు టీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    తెలంగాణలో బీఎస్పీ రాజకీయాలన్నీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోనే ముందుకు సాగే అవకాశం ఉండటంతో.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేదా ? అనే అంశంపై తుది నిర్ణయం కూడా ఆయనదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్‌లో పోటీ చేసే విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వచ్చాయి. అయితే కీలకమైన ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై ఆయన ఎల్లుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగబోయే సభలో దీనిపై ప్రకటన చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ బీఎస్పీ హుజూరాబాద్‌లో పోటీ చేస్తే.. అక్కడి అభ్యర్థి తరపున ప్రచారం చేసే బాధ్యత కూడా ప్రవీణ్ కుమార్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఆయన ఎక్కువగా టీఆర్ఎస్‌నే టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి.

    ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రవీణ్ కుమార్. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌పై ఆయన పెద్దగా విమర్శలు చేయడం లేదనే వాదన కూడా ఉంది. దీనికితోడు ఆయనకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ తనవంతు ప్రయత్నాలు చేస్తోందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో బీఎస్పీ అభ్యర్థిని దింపితే దాని ప్రభావం అందరికంటే ఎక్కువగా టీఆర్ఎస్‌పైనే ఉంటుందని.. టీఆర్ఎస్‌కు రావాల్సిన దళిత ఓట్లను ఆయన ఎంతో కొంత చీల్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి హుజూరాబాద్ బరిలో బీఎస్పీ ఉంటుందా లేదా అన్నది టీఆర్ఎస్‌ను టెన్షన్ పెట్టే అంశమే అనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: