news18-telugu
Updated: November 19, 2020, 12:23 PM IST
మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలో? అరాచకం కావాలో? తేల్చుకోవాలని నగర వాసులకు సూచించారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని.. అరాచకం కావాలంటే బీజేపీకి ఓటువేయాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల నేపథ్యంలో.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని.. పలు అంశాలపై మాట్లాడారు. ఆరున్నరేళ్లుగా నగరం ఎంతో ప్రశాంతంగా ఉండి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని.. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
తెలంగాణ ఏర్పడితే.. రాష్ట్రం అంధకారం అయిపోతుందని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుతుందని గతంలో ఎన్నో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. కానీ మన రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని.. ట్రాఫిక్, తాగునీటి కష్టాలను తీర్చామని తెలిపారు. గతంలో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని వెల్లడించారు. 1916లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, 1920 గండిపేట జలాశయాలను కట్టారన్న ఆయన.. ఆ తర్వాత ఎవరూ తాగునీటిపై దృష్టిపెట్టలేదని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. 2020లో కేశావపురం రిజర్వాయర్ కడుతున్నట్లు తెలిపారు.
నగరంలోకి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఔషధ రంగంలోనూ హైదరాబాద్ దూసుకెళ్తోందని చెప్పారు. పేదల కోసమే రెండు పడకగదుల ఇళ్లను అందుబాటులోకి తెస్తున్నామని.. రూ.9,714 కోట్లతో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని నిరూపించామన్న మంత్రి కేటీఆర్.. జీడిమెట్లలో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని.. ఐనా ఇక్కడ పథకాలకు వాళ్లే డబ్బలు ఇస్తున్నట్లు బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలకు తెలుసని.. అభివృద్ధికే పట్టంగడతారని స్పష్టంచేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2020, 12:13 PM IST