Arvind Kejriwal : అవును నేను టెర్రరిస్ట్ నే,ఎందుకు అరెస్ట్ చేయ్యలేదు..కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)
Worlds Sweetest Terrorist : అరవింద్ కేజ్రీవాల్...పంజాబ్ సిఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Kejriwal Denies Separatist Remarks : పంజాబీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ సమయంలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురుస్తోంది. అన్ని పార్టీలను అవినీతి పార్టీలుగా పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఎదురు దాడి చేయడానికి ఇప్పుడు పంజాబ్ లోని...అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, సుఖ్ బీర్ బాదల్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ వంటి నేతలందరూ ఒక్కటై ఆప్ పై విమర్శల దాడి చేస్తున్నారు.
తాజాగా కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ దర్యాప్తు చేయించాలని సీఎం చన్నీ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ఖలిస్థాన్ అనుకూలవాది అని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్...పంజాబ్ సిఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ... వీరంతా పంజాబ్ ను విభజించాలని కలలుగంటున్నారని మండిపడ్డారు. అధికారంలో కొనసాగటం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సైతం వీరు సిద్ధమేనన్నారు. వారి ఎజెండాకు, పాకిస్థాన్ ఎజెండాకు తేడా లేదన్నారు.
ఇక తనపై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను ఖలిస్థానీ వేర్పాటువాదినని వచ్చిన ఆరోపణలను శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తాను ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మిస్తున్నందుకు మధురమైన ఉగ్రవాదిని అయి ఉండవచ్చునన్నారు. తాను ఉగ్రవాదినై ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ఎందుకు అరెస్టు చేయలేదని శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
దేశాన్ని రెండు ముక్కలుగా విభజించేందుకు తాను పదేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నానని, ఓ భాగానికి ప్రధాన మంత్రిని కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వాళ్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలుఅంటున్నారని..ఇదంతా కామెడీగా ఉందన్నారు.ఈ వాదనను చూసి నవ్వుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను చాలా పెద్ద ఉగ్రవాదినని ఈ మాటల అర్థమని, అలాంటపుడు వారి భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా పదేళ్ళపాటు అధికారంలో ఉందని, అప్పుడు వారు నిద్రపోతున్నారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మోదీ కూడా తనను ఎందుకు అరెస్టు చేయించలేదు అని ప్రశ్నించారు.
ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని.. ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, సుఖ్ బీర్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ వంటి నాయకులంతా కలిసి వస్తున్నారని ఆరోపించారు. ఈ నాయకులంతా ఒకే విధంగా మాట్లాడుతున్నారన్నారని... దీనినిబట్టి వీరంతా రాత్రి సమయంలో వీడియో కాల్ లేదా కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకుంటున్నట్లు ఉందన్నారు.అసలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. కాగా,పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.