మహారాష్ట్ర రాజకీయాల్లో ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాత్రికే రాత్రి మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మార్చేసిన అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఓవైపు ఎన్సీపీ నేతలు సంప్రదింపులు జరుపుతుండగానే.. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'అంతా సవ్యంగానే సాగుతోంది. ఎవరూ ఆందోళ చెందాల్సిన పనిలేదు. కావాల్సిందల్లా కొంచెం ఓపిక పట్టడం మాత్రమే' అని ట్వీట్ చేశారు.
అంతేకాదు, తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.అసలు ట్విస్ట్ ఏంటంటే.. తమ నాయకుడు శరద్ పవారే అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సర్కార్ సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ది కోసం ఈ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. తన ట్విట్టర్ ఖాతాలోనూ 'డిప్యూటీ సీఎం' ట్యాగ్‌ను యాడ్ చేసుకున్న పవార్.. కవర్ పేజీని సైతం మార్చేశారు. మహారాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో ఒకదాన్ని తన కవర్ పేజీగా పెట్టుకున్నారు. అటు ప్రధాని మోదీకి అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినందుకు మోదీ శుభాకాంక్షలు తెలపగా.. పవార్ ధన్యవాదాలు చెప్పారు.
ఇదిలా ఉంటే,అజిత్ పవార్ వ్యాఖ్యలు శరద్ పవార్‌పై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి.శరద్ పవారే తమ నాయకుడని.. తాను ఎన్సీపీలోనే కొనసాగుతానని అజిత్ పవార్ వ్యాఖ్యానించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. శరద్ పవారే వ్యూహాత్మకంగా అజిత్ పవార్‌ను బీజేపీ వైపు పంపించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో చివరకు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
Published by:Srinivas Mittapalli
First published:November 24, 2019, 17:33 IST