'తాతకు ప్రేమతో'...దేవెగౌడ కోసం ఎంపీ సీటుకు ప్రజ్వల్ రాజీనామా?

దేవెగౌడ, ప్రజ్వల్ రేవణ్ణ

తాత కోసం ఎంపీ సీటును వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ప్రజ్వల్... హసన్ నుంచి తన తాత దేవెగౌడ తిరిగి పోటీచేస్తారని వెల్లడించారు.

  • Share this:
    కర్నాటక రాజకీయాలు ఇప్పుడు దేవెగౌడ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయాల్లో తలపండిన దేవెగౌడ తుమకూరు స్థానంలో ఓడిపోవడమే అందుకు కారణం..! కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. గతంలో ప్రధానిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఆయనది. కానీ ఈ లోక్ ‌సభ ఎన్నికల్లో బంధుప్రీతి వల్ల బొక్కబర్లా పడ్డారు. మనువడి కోసం హసన్ సీటును వదులుకొని తుమకూరులో పోటీచేసిన దేవెగౌడ.. అక్కడ ఓటమిని చవిచూశారు. బీజేపీకి చెందిన జీఎస్ బసవరాజ్ తుమకూరులో గెలిచారు.

    ఐతే దేవెగౌడ ఓటమిని ఆయన మనువడ ప్రజ్వల్ (రేవణ్ణ కుమారుడు) జీర్ణించులేకపోతున్నారు. తన కోసం తాతయ్య హసన్ సీటును వదలుకున్నాడని...కానీ ఆయన మాత్రం తుమకూరులో ఓడిపోయాడని మదనపడుతున్నారు. తన వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత కోసం ఎంపీ సీటును వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ప్రజ్వల్... హసన్ నుంచి తన తాత దేవెగౌడ తిరిగి పోటీచేస్తారని వెల్లడించారు. కాగా, గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో హసన్ నుంచి పోటీచేసిన ప్రజ్వల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

    మరోవైపు దేవెగౌడ ఫ్యామిలీ నుంచి మరో నేత, సినీ నటుడు నిఖిల్ (కుమారస్వామి కుమారుడు) సైతం ఓటమిపాలయ్యారు. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్ తరపున బరిలో దిగారు. అక్కడ సినీ నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో నిఖిల్ ఓటమి పాలయ్యారు. మాండ్యాలో తమఅభ్యర్థిని బరిలోకి దింపకుండా సుమలతకు మద్దతిచ్చింది బీజేపీ. అంతేకాదు కేజీఎఫ్ స్టార్ యశ్ సహా పలువురు సినీస్టార్లు సుమలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇది సుమలతకు కలిసి రావడంతో మాండ్యాలో ఆమె గెలుపు సునాయాసమైంది.
    First published: