నువ్వంత పోటుగాడివైతే ఆ పని చెయ్ : చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Kodali Nani challenges Chandrababu Naidu : అందరిని తానే తయారుచేశానని చెప్పే చంద్రబాబు.. మరి ఆయన్ను తయారుచేసిన ఇందిరాగాంధీ పార్టీని ఎందుకు వీడారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను చేసి,మంత్రిని చేసిన పార్టీని వీడి తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని నిలదీశారు.

news18-telugu
Updated: November 16, 2019, 5:10 PM IST
నువ్వంత పోటుగాడివైతే ఆ పని చెయ్ : చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
చంద్రబాబు నాయుడు,కొడాలి నాని(File Photo)
  • Share this:
టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిటికెస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కింద ఉన్న స్టోర్ రూమ్‌లో పెట్టేయగలం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటోళ్లను,తన లాంటోళ్లను,వంశీ లాంటోళ్లను తానే తయారుచేశానని చంద్రబాబు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబు నిజంగా అంత పోటుగాడైతే.. తెలుగుదేశం పార్టీని వీడి, 'సీబీఎన్ తెలుగుదేశం' పేరుతో పార్టీ పెట్టి గెలవాలని సవాల్ చేశారు. అదే చేస్తే చంద్రబాబుతో సహా ఎవరికీ డిపాజిట్లు దక్కవని విమర్శించారు. ఒకవేళ గెలిస్తే తాను రాష్ట్రం వీడి పోతానని చెప్పారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని.. ఇంకో వెయ్యి జన్మలెత్తినా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేడని అన్నారు.

అందరిని తానే తయారుచేశానని చెప్పే చంద్రబాబు.. మరి ఆయన్ను తయారుచేసిన ఇందిరాగాంధీ పార్టీని ఎందుకు వీడారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను చేసి,మంత్రిని చేసిన పార్టీని వీడి తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని నిలదీశారు. నువ్వు చేసింది లుచ్చా పనైతే.. తాను లుచ్చానే అని.. అది మంచి పనైతే.. తాను మంచివాడినే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నిన్ను పార్టీలోకి తీసుకుని మంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచావని చంద్రబాబును ఉద్దేశించి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానని.. ట్రంపును తానే అధ్యక్షుడిని చేశానని చెప్పుకునే చంద్రబాబు.. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం ఎందుకు టీడీపీని గెలిపించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో 1983, 85, 94లలో టీడీపీ గెలిచిందని.. ఆ తర్వాత 1999, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గుర్తుచేశారు. అటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని గుర్తుచేశారు. చంద్రబాబు అంత సత్తా ఉన్న నాయకుడైతే అక్కడ టీడీపీని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారని నిలదీశారు.
Published by: Srinivas Mittapalli
First published: November 16, 2019, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading