టీవీ9 సీఈవో పదవి తనను తప్పించడంపై రవి ప్రకాశ్ స్పందించారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో tv9 సంస్థలోకి చొరబడ్డారని అలంద మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీఈవోగా తప్పించినప్పటికీ షేర్ హోల్డర్‌గా, వాటా ప్రతినిధిగా టీవీ9లో అలంద మీడియా పక్కనే తాను ఉంటానని స్పష్టంచేశారు రవిప్రకాశ్. టీవీ9ని వదలబోనని పరోక్షంగా తేల్చిచెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో TV9 వ్యవస్థాపక అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించటానికి తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని రవి ప్రకాశ్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం సమావేశమైన అలంద మీడియా డైరెక్టర్స్ బోర్డు టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయనకు అదనంగా టీవీ9 తెలుగు బాధ్యతలను అప్పజెప్పింది. అటు గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన్ను టీవీ9 సీవోవోగా నియమిస్తూ అలంద మీడియా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. టీవీ9 ఉద్యోగులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Ravi prakash, Telangana, TV9