CWC Meeting: షాకిచ్చిన సోనియా గాంధీ -congressకు ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ నేనే -G23 నేతలకు క్లాస్

సీడబ్ల్యూసీ సమావేశం

congress working committee Meeting : కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) భేటీలో అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త నాయకత్వం ఎంపిక ఇప్పట్లో ఉండబోదని, పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలు తానేనని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అదే సమయంలో తనపై అసమ్మతిగళం వినిపించిన 23 మంది సీనియర్లకు సోనియా క్లాస్ పీకారు..

  • Share this:
జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (congress working committee) సమావేశంలో అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లుగా అధికారానికి దూరమై, ఒక్కొక్కరుగా నేతలను కోల్పోతున్న కాంగ్రెస్ కు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా సీడబ్ల్యూసీ ఉంటుందని భావించినా, ప్రస్తుతానికి నాయకత్వ మార్పుకంటే పార్టీలో క్రమశిక్షణ, అధికార బీజేపీపై పోరాటం ఉధృదం లాంటి అంశాలే ప్రధానమైనవని సోనియా గాంధీ అన్నారు. సంస్థాగత ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూనే, వాటి కోసం సీనియర్లు కొందరు రచ్చకెక్కడాన్ని సోనియా ఖండించారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్ అప్ డేట్స్ ఇవి..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ ప్రారంభ ఉపన్యాసంలోనే సోనియా గాంధీ పలు సంకేతాలు, సూచనలు, చురకలు ఇచ్చారు. ఆమె అధ్యక్షతన సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతోన్న భేటీకి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీసహా సంస్థాగత ఎన్నికలు డిమాండ్ చేస్తూ గతంలో సోనియాకు అసమ్మతి లేఖ రాసి, మీడియాకెక్కిన సీనియర్లు సైతం హాజరయ్యారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నందున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరే లోటుగా కనిపించారు. సీనియర్ల రచ్చపై సోనియా గరం గరం వ్యాఖ్యలతో క్లాస్ పీకారు..

‘సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటాన్ని నేను ఎల్లవేళలా స్వాగతించాను.. కానీ మన సీనియర్లు కొందరు సంస్థాగత ఎన్నికల విషయమై బయట ఏవేవో మాట్లాడారు. నాలుగు గోడల మధ్య జరిగే సీబ్ల్యూసీ భేటీపై మీడియాతో మరో రకంగా మాట్లాడం మానేయాలి. పార్టీ పదవులకు ఎన్నిక అనివార్యమన్న విషయం నాకు గుర్తుంది. 2019 నుంచి నేను తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉంటున్నానన్న సంగతిని నేను మర్చిపోలేదు. అయితే, మీరు అనుమతించినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమ్ అధ్యక్షురాలిగా నేనే ఉంటాను..’అని సోనియా గాంధీ అన్నారు.

మోదీ సర్కారుపై కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నదని, సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమం, కరోనా విపత్తు నిర్వహణలో కేంద్ర వైఫల్యం తదితర అంశాల్లో పార్టీ ప్రజల వైపు నిలిచిందని సోనియా గుర్తుచేశారు. కలిసివచ్చే పార్టీలతో తరచూ సంభాషణలు జరుపుతూ, పార్లమెంట్ వేదికగా ఉమ్మడి పోరాటం చేస్తున్నామని ఆమె తెలిపారు. పార్టీలో కింది నుంచి పైదాకా సమర్థవంతమైన, పనిచేసే నాయకత్వాన్ని పెంపొందించుకుందామన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి రెండేళ్లు దాటినా కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాయడం సంచలనం రేపింది. నెలల వాయిదా తర్వాత కొత్త నాయకత్వ నిర్ధారణపై ఇవాళ సీడబ్ల్యూసీ భేటీ సమావేశాలు ఆ దిశగా ఉండబోవని సోనియా ప్రారంభ ప్రసంగంలోనే స్పష్టమైంది. ఇంకొద్ది నెలల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, ఆ ఎన్నికలు అయ్యేదాకా సోనియానే అధినేత్రిగా కొనసాగాలని కీలక నేతలు కోరిన నేపథ్యంలో కొత్త నాయకత్వ ఎంపిక మరోసారి వాయిదాపడినట్లయింది. కాగా, 2022 సెప్టెంబర్ లో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Published by:Madhu Kota
First published: