Home /News /politics /

HYDERABAD GHMC ELECTIONS RESULTS 2020 BJP IS LEADING IN POSTAL BALLOT VOTES SK

GHMC Elections Results 2020: బీజేపీకి అనూహ్య ఓట్లు.. పోస్టల్ బ్యాలెట్‌లో లీడింగ్

బీజేపీ జెండాలు (File)

బీజేపీ జెండాలు (File)

GHMC Elections Results 2020: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ప్రతి డివిజన్‌లో 10-20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చాలా చోట్ల అసలు కౌంటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

    జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకి అనూహ్య ఓట్లు పోలయ్యాయి. ఉదయం 09.30 గంటల సమయానికి బీజేపీ 46 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 24 ప్రాంతాల్లో టీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. మరో 11 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఐతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ప్రతి డివిజన్‌లో 10-20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చాలా చోట్ల అసలు కౌంటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సత్తా చాటినంత మాత్రం.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


    మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్నుతో టిక్ పెట్టినా కూడా ఆ ఓటును పరిగణించాలంటూ నిన్న రాత్రి ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జూమ్ ద్వారా విచారించారు. బీజేపీ వాదనను సమర్థిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గెలుపు ఓటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

    కాగా, డిసెంబ‌ర్ 1న జ‌రిగిన ఎన్నిక‌ల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది (46.55 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగు నమోదు కాగా... అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగు జరిగింది. సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్‌ జరుగగా.. రెండో స్థానంలో గాజులరామారం (53.65 శాతం), మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట (53.07 శాతం) ఉన్నాయి.

    హైదరాబాద్ నగరంలో 48 గంటల పాటు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ర్యాలీలు బ్యాన్ చేసినట్టు చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు వైన్ షాపులు కూడా మూసి ఉంటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ పార్టీ మరోసారి గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరేస్తుందని చెప్పాయి. అలాగే, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన సీక్రెట్ సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోందని నివేదిక వచ్చినట్టు తెలిసింది. ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించినట్టు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Hyderabad - GHMC Elections 2020, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు