Home /News /politics /

HYDERABAD GHMC ELECTIONS PM MODI DIALS BJP TELANGANA PRESIDENT BANDI SANJAY OVER GREATER ELECTIONS SK

GHMC Elections: గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని మోదీ ఆరా.. బండి సంజయ్‌కి ఫోన్

ప్రధాని మోదీ, బండి సంజయ్

ప్రధాని మోదీ, బండి సంజయ్

PM Narendra Modi: నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలని.. తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

    గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరాతీశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి.. ఎన్నికల గురించి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం జరిగిన పోలింగ్ సరళి, పార్టీల స్థితిగతులపై ముచ్చటించారు. ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి కూడా ప్రధాని మోదీ అడిగినట్లు తెలుస్తోంది. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే ధైర్యంగా ముందుకు సాగాలని.. తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రధాని.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది. అక్కడ 70.39శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అత్యల్పంగా యూసఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదయింది.

    ఓల్డ్ మలక్ పేట్‌లో పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. సీపీఐ అభ్యర్థికి సీపీఎం ఎన్నికల గుర్తుకేటాయించడంతో.. ఆ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు అక్కడ పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు. డిసెంబరు 3న ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.


    దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపుతో పార్టీలో బలోపేతంపై బీజేపీ సీరియస్‌గా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపి.. టీఆర్ఎస్‌కు పోటీగా ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ తేజస్వి సూర్య నగరంలో పర్యటించి..ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని.. మేయర్ పీఠం తమదేనని బీజేపీ ధీమావ్యక్తం చేస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bandi sanjay, Bjp, Hyderabad - GHMC Elections 2020, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు