news18-telugu
Updated: December 1, 2020, 10:28 PM IST
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
Greater Hyderabad Municipal Elections: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. ఎన్నికల తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ శాతం తగ్గిచేందుకు కుట్ర జరిగిందని.. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం సహకరించిందని బాంబు పేల్చారు. ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. కానీ బీజేపీ కార్యకర్తలు ఎక్కడా గొడవకు దిగలేదని స్పష్టం చేశారు బండి సంజయ్.
'' ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని బీజేపీ మొదటి నుంచీ కోరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అన్ని విధాలుగా సహకరించాం. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సహకరించడం సిగ్గుచేటు. పోలింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు గొడవలకు దిగలేదు. పోలింగ్‌లో పాల్గొన్న ప్రజలు, బీజేపీకి సహకరించిన కార్యకర్తలు, పోలింగ్ సిబ్బందికి ధన్యవాదాలు.'' అని బండి సంజయ్ అన్నారు.
కాగా, ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదయింది. 40శాతం కూడా దాటలేదు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ.. ఎక్కడా క్యూలైన్లు కనిపించలేదు. పోలింగ్ కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు దయచేసి ఇళ్ల నుంచి వచ్చి ఓటేయాలని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదు. ఓటు వేసేందుకు అనాసక్తి చూపించారు. గుర్తులు తారుమారవడంతో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో పోలింగ్ రద్దయింది. డిసెంబరు 3న అక్కడ రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 10:23 PM IST