HYDERABAD GHMC ELECTION RESULTS 2020 UPDATES CONGRESS GOT MORE POSTAL BALLOTS IN BANJARAHILLS THAN TRS CANDIDATE BA
GHMC ఎన్నికల ఫలితాలు: కేకే కుమార్తెకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్, ఉద్యోగులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది
Hyderabad Municipal Election 2020 Results Updates: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation Elections 2020) అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు (K.Keshava Rao) కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఈ పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి. బంజారాహిల్స్ నుంచి టీఆర్ఎస్ తరఫున కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్ రాజ్ రాథోడ్ బరిలో నిలిచారు. బీజేపీ తరఫున బద్దం మహిపాల్ రెడ్డి పోటీ చేశారు. అయితే, టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధన్ రాజ్ రాథోడ్‌కు పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా రావడం విశేషం. సహజంగా పోస్టల్ బ్యాలెట్లు అంటే ఉద్యోగులకు సంబంధించినవి. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బంది తమ డివిజన్లో ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిని ఎంచుకుంటారు. బంజారాహిల్స్ డివిజన్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లు కేవలం 1926 మాత్రమే వచ్చాయి. వాటిలో కూడా 40 శాతం ఓట్లు చెల్లలేదు. ఆ ఓట్ల లెక్కింపు కూడా సుమారు 2 గంటలకు పైగా సమయం పడింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బ్యాలెట్ల బాక్సులను తెరుస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్లు అన్నిటినీ ఒక చోట పోసి వాటిని 25 చొప్పున కట్టలుగా కడతారు. ఆ తర్వాత వాటిని కౌంటింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా జరగడానికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, తక్కువ ఓట్లు వచ్చిన మెహిదీపట్నం డివిజన్లో తొలి ఫలితం వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. ఆ పార్టీకి ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 71, టీఆర్ఎస్ 22, ఎంఐఎం 5, కాంగ్రెస్ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్నుతో టిక్ పెట్టినా కూడా ఆ ఓటును పరిగణించాలంటూ నిన్న రాత్రి ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జూమ్ ద్వారా విచారించారు. బీజేపీ వాదనను సమర్థిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గెలుపు ఓటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.