news18-telugu
Updated: November 6, 2020, 9:59 AM IST
కేసీఆర్‌తో తీగల కృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)(ఫొటో సోర్స్-Facebook-Teegala Krishna Reddy)
తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతితో భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీ గూటికి చేరుతారనే పెద్ద ఎత్తున ఊహగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆమెను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఇక, తాజాగా టీఆర్ఎస్ నాయకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఆయన త్వరలోనే కాషాయ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో చేరి 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాల్లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయన సైకిల్ దిగి కారు ఎక్కారు. ఇక, 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తీగల.. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిన తీగల.. ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరి.. మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ పరిణామాలు తీగలకు ఇబ్బందికరంగా మారాయి.
అయితే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మహేశ్వరం టీఆర్ఎస్ జడ్పీటీసీగా ఉన్న తీగల అనితారెడ్డి.. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇక, ఒకవేళ తీగల టీఆర్ఎస్కు గుడ్ బై చెబితే.. ఆయన కోడలు కూడా పార్టీకి వీడ్కోలు చెబుతరా అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 6, 2020, 9:59 AM IST