Raghurama Krishnam Raju: సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్.. రఘురామ పిటిషన్ పై విచారణకు ఓకే

ఎంపీ రఘరామ కృష్ణంరాజు, సీఎం జగన్(ఫైల్ ఫొటో)

సీఎం జగన్ (AP CM Jagan) కు పక్కలో బల్లెంలా మారిన రఘురామ కృష్ణం రాజు (Ragu RamaKrishnam Raju).. వరుస ప్రెస్ మీట్లు, ఆరోపణలు, విమర్శలతో తలనొప్పులు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు షాకిచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 22న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. రఘురామ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనంగా మారింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఈనెల మొదటి వారంలో రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని బెయిల్ రద్దు చేయాలని పేర్కొన్నారు. 11 ఛార్జ్ షీట్లలో జగన్ ఏ1గా ఉన్నా.. విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. జగన్ నిర్దోషిలా బయటపడాలనే నా ఉద్దేశమన్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత నాపై ఉంద రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

    పిటిషన్ వేసిన సందర్భంగా రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలు, పాలన పేరుతో విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారన్నారు. కోర్టు విచారణ తప్పించుకుంటుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అంతేకాదు తన పదవిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందన్నారు. అంతేకాదు సీబీఐ కేసుల్లో నిందితులైన నలుగురికి రాజ్యసభకు పంపారని.. అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని విమర్శించారు. ఓ అధికారికి ఏకంగా ముఖ్యకార్యదర్శి హోదా కల్పించారన్నారు. మరికొంతమంది నిందితుల బంధువులకు డిప్యూటీ సీఎంలు, ఇతర పదవులు కట్టబెట్టారన్నారు. వీరంతా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారాయన.

    ఇది చదవండి: కరోనా కట్టడికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు


    సీబీఐ కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు జగన్ జైలుకు వెళ్తారని.. సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు పిటిషన్ వేయడం.., ఇప్పుడు ఆ పిటిషన్ విచారణకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరం చర్చ జరుగుతోంది. ఈ పిటిషన్ పైనా సుదీర్ఘకాలం విచారణ జరుగుతుందా.. లేదా త్వరగానే తేల్చేస్తారా..? అనే అంశం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ విధించాల్సిందేనా...? రికార్డు స్థాయిలో కరోనా కేసులు


    సీఎం జగన్ కు పక్కలో బల్లెంలా మారిన రఘురామ కృష్ణం రాజు.. వరుస ప్రెస్ మీట్లు, ఆరోపణలు, విమర్శలతో తలనొప్పులు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పై వైసీపీ ఎంపీలు, ముఖ్యనేతలు విమర్శలదాడి చేస్తున్నా.. ఆయన మాత్రం ఏకంగా సీఎం బెయిల్ నే టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ విచారణ ఎన్ని ములుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: