తెలంగాణలో కాంగ్రెస్ మరింత దిగజారింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న సీటును ఆ పార్టీ కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే తన భార్యను రంగంలోకి దించినా సీటును దక్కించుకోలేక పోయారు. ముందస్తు ఎన్నికల్లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత తన శాసన సభ సభ్యులను కోల్పోయింది. ఇప్పుడు హుజూర్నగర్ కూడా చేజారిన క్రమంలో ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి ముందస్తు ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన.. ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అవడంతో తన భార్య పద్మావతిని బరిలోకి దించారు.
అయితే, ఆమెను ప్రజలు ఆదరించలేకపోయారు. పార్టీకి మంచి పట్టున్న నేరేడుచర్లలోనూ టీఆర్ఎస్ 10వేలకు పైగా మెజారిటీని దక్కించుకుంది. దీంతో ఆమె ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సందర్భంలోనే ఉత్తమ్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఆయన కాకుండా.. రేవంత్, పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు రాజీనామా చేశారు. ఉత్తమ్ మాత్రం రాజీనామా చేయలేదు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే పార్టీలో రేవంత్, ఉత్తమ్ వర్గాలు విడిపోయాయి. సీనియర్లు ఉత్తమ్ వైపు ఉండగా, ఓ వర్గం రేవంత్‌కు మద్దతు ఇస్తోంది. టీపీసీసీ పీఠంపై కన్నేసిన రేవంత్ రెడ్డి.. ఆ దిశగా పావులు కదపడంతో పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తేనే బెటర్ అని ఉత్తమ్ భావిస్తున్నారని, తుది ఫలితాలు వెల్లడయ్యాక ఏ క్షణంలోనైనా ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.