బీజేపీ నెక్ట్స్ టార్గెట్... తెలంగాణలోని ఆ అసెంబ్లీ స్థానంపై ఫోకస్

తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో రాష్ట్రంపై బీజేపీ వ్యూహం మారినట్టు జాతీయ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాము మరింతగా ఫోకస్ చేస్తే... బెంగాల్‌తో పాటు తెలంగాణలోనూ పాగా వేయొచ్చనే యోచనలో కమలనాథులు ఉన్నారు.

news18-telugu
Updated: May 28, 2019, 11:06 AM IST
బీజేపీ నెక్ట్స్ టార్గెట్... తెలంగాణలోని ఆ అసెంబ్లీ స్థానంపై ఫోకస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తెలంగాణలో అనూహ్యమైన ఫలితాలను సాధించిన బీజేపీ... మున్ముందు రాష్ట్రంలో మరింతగా బలపడేందుకు ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కంచుకోటగా ఉంటూ వస్తున్న ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆ పార్టీకి షాక్ ఇచ్చి మూడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ... తాజాగా దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నికవడంతో... ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

దీంతో ఈ సీటుపై బీజేపీ కూడా సీరియస్‌గానే దృష్టి సారిస్తోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో రాష్ట్రంపై బీజేపీ వ్యూహం మారినట్టు జాతీయ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాము మరింతగా ఫోకస్ చేస్తే... బెంగాల్‌తో పాటు తెలంగాణలోనూ పాగా వేయొచ్చనే యోచనలో కమలనాథులు ఉన్నారు. హుజూర్ నగర్ స్థానాన్ని తాము గెలుచుకోగలిగితే... తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని ఆ పార్టీ భావిస్తోంది.

అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని నమ్ముతోంది. ఈ పరిణామాలు తమకు ఎంతగానో లాభిస్తాయని... అనేకమంది నేతలు కూడా తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందని కాషాయదళం అంచనా వేసుకుంటోంది. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కోసం ఎదురుచూస్తున్న కేంద్రంలోని బీజేపీ నాయకత్వం... హుజూర్ నగర్ ఉపఎన్నికపై గట్టిగానే దృష్టి పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెడితే... కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్‌కు కూడా ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>