ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అసలైన ఫలితం నవంబర్ 2న వెలువడనుండగా, ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం గెలుపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దే అని పేర్కొన్నాయి. ఈటల వ్యక్తిత్వం, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టాయని, టీఆర్ఎస్ అభ్యర్థిపై మూడు శాతం ఓట్లతో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాల్లో వెల్లడైంది..
తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినదిగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల సంగ్రామం ముగిసింది. అధికారికంగా ఎన్నిక ఫలితాలు నవంబర్ 2న వెలవడనుండగా, ఇవాళ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలవడ్డాయి. పలు మీడియా, సర్వే సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్ అంచనాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని సంస్థల సర్వేల్లోనూ హుజూరాబాద్ ఫలితం ఈటలకు అనుకూలంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరిగింది. హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లుండగా, సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 86.33 శాతం పోలింగ్ నమోదైంది. కచ్చితమైన లెక్కలను ఈసీ వెల్లడించనుంది. నిషేధం గడువు ముగియడంతో సాయంత్రం 7 తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఆ వివరాలిలా ఉన్నాయి..
హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ‘పీపుల్స్ పల్స్’ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మొగ్గు కనిపించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని, మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం మాత్రమేనని ‘పీపుల్స్ పల్స్’ పేర్కొంది. హుజూరాబాద్ లో ఎన్నికల యుద్ధం రెండు పార్టీల మధ్యే జరిగిందని, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కానుందని పేర్కొంది. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో సానుకూలతగా మారాయని, ఈటల వ్యక్తిత్వం కూడా ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టిందని ‘పీపుల్స్ పల్స్’ అభిప్రాయపడింది.
పొలిటికల్ ల్యాబొరేటరీ అనే మరో సంస్థ సైతం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ ను ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల 24వేల ఓట్ల తేడాతో విజయం సాధించొచ్చని, బీజేపీ 51శాతం ఓట్లు, టీఆర్ఎస్ 42శాతం ఓట్లు సాధిస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. అనూహ్యరీతిలో ఈటల సొంత మండలం కమలాపూర్ లో, ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పడతాయని, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో మెజార్టీతోనే ఈటల గెలుస్తాడని పొలిటికల్ ల్యాబరేటరీ పేర్కొంది.
మూర్తి ఆత్మసాక్షి గ్రూప్ వారు చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు వెల్లడైంది. బీజేపీకి 50.5శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 43.1శాతం ఓట్లు, కాంగ్రెస్ 5.7శాతం, ఇతరులకు 0.7శాతం ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే ఫలితాల్లో చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.