చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్ (Huzurabad) లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు అక్కడ 45.63 శాతం పోలింగ్ నమోదయింది. ఐతే పోలింగ్ వేళ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender) తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కమలాపూర్‌లో ఓటువేసిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడంపై మండిపడుతున్నాయి. ఈటల రాజేందర్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల తీరుపై ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender), ఆయన భార్య జమున (Jamuna) కమలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ మండలం కందుగుల ZP హైస్కూల్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు ఈటల. ఉప్పలపల్లిలోని పోలింగ్ బూత్ ను కూడా పరిశీలించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. “ అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది . మాకు డబ్బులు అందలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చారు . పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు . ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది . మంచి చెడులను ఆలోచించే సత్తా ప్రజలకు ఉంది " అని పేర్కొన్నారు.
మొత్తం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. హుజురాబాద్‌లో 2,37,022 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లేందుకు వీల్ చైర్లను , కోవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు 144 సెక్షన్ అమలులో ఉంటుంది . ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను ఉపయోగిస్తున్నారు . మొత్తం బందోబస్తు సిబ్బంది 3,865 మంది కాగా , ఎన్నికల సిబ్బంది 1715 విధుల్లో పాల్గొననున్నా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పోటీ తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావుల మధ్య కొనసాగనుంది. నవంబరు 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.