HUZURABAD BYPOLL 2021 RETURNING OFFICER RAVINDER REDDY GIVES CLARITY ON VVPAT ISSUE IN HUZURABAD SK
Huzurabad Bypoll: వీవీప్యాట్ వివాదంపై ఎన్నికల అధికారుల వివరణ.. అసలేం జరిగిందంటే..
వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
Huzurabad Bypolls: పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.64శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ (Huzurabad Bypoll) ముగిసినా.. ఇంకా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. వీవీప్యాట్(VVPAT)ను ప్రైవేట్ వాహనంలో తరలించడంపై కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఎన్నికల అధికారులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీవీప్యాట్‌ను పోలింగ్ సమయంలో వాడలేదని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ సమయంలో పనిచేయకపోవడంతో దాని పక్కనబెట్టి, వేరొక దానిని వినియోగించామని చెప్పారు. పాడైపోయిన వీవీప్యాట్‌ను మాత్రమే వేరొక వాహనంలో తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
''బస్సుల్లో ఈవీఎంలు మార్చినట్లు వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మకండి. 200వ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ సందర్భంగా వీవీప్యాట్ పనిచేయలేదు. వెంటనే రిజర్వ్ వీవీ ప్యాట్‌ను అమర్చాం. పోలీస్ ఆఫీసర్ బస్సులోనే ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీవీప్యాట్‌ను పోలింగ్ రోజు అసలు వాడలేదు. మాక్ పోలింగ్‌కు ముందే తీసేశాం.'' అని హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.
అంతకుముందు ఈటల రాజేందర్ కూడా దీనిపై స్పందించారు. '' బస్సుల్లో వెళ్తున్న ఈవీఎంలను కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ నుండి కరీంనగర్‌కి గంట సేపు లోపల బస్‌లు చేరుకోవాలి. కానీ 12 గంటల వరకు కూడా చేరలేదు. EVM కరాబ్ అయినవి అని చెప్పి మార్చడం అనుమానాలకు తెరలేపింది. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా ? ఇలాంటిది ద్రోహపూరితమైనది. నీచమైనది.'' అని విమర్శించారు.
మరోవైపు ఈ అంశంపై బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిశారు. వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి మార్చడంపై ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపించాలని డిమాండ్ చశారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని చేసినా ఎన్నికల్లో గెలవరని కేసీఆర్‌కు తెలిసే, ఇలా ఈవీఎంలను మార్చుతున్నారని విరుచుకుపడుతున్నారు.
కాగా, పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.64శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయింది. పెరిగిన ఓటింగ్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది తెలియాల్సి ఉంది. నవంబరు 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.