HUZURABAD BYPOLL 2021 ETALA RAJENDER GIVES CLARITY ON HIS MEETING WITH REVANTH REDDY SK
Huzurabad Bypoll: ఔను.. రేవంత్‌ను కలిశా.. తప్పేంటి? మంత్రి కేటీఆర్‌కు ఈటల కౌంటర్
ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Huzurabad Bypoll: మంత్రి కేటీఆర్ ఆరోపణలపై ఈటల రాజేందర్ స్వయంగా స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలను కలిశానని స్పష్టం చేశారు. కానీ ఇటీవల కలవలేదని చెప్పారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల (Huzurabad Bypoll)కు మరో వారం రోజులే సమయం ఉన్న వేళ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender) పై మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) చేతులు కలిపాయని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి (Revanth Reddy) గోల్కొండ రిసార్ట్స్‌లో చర్చలు జరిపారని బాంబు పేల్చారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ప్రజలు చీకటి ఒప్పంద కుట్రలను తిప్పికొట్టి, టీఆర్ఎస్నే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదు. కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి. హుజురాబాద్‌లో రెండు జాతీయ పార్టీల అభ్యర్థిని టీఆర్ఎస్ పోటీపడుతోంది. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈటల గెలుపు వారికి ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యం. ఏడాది తర్వాత ఈటల రాజందర్ కాంగ్రెస్‌లో చేరే ఒప్పందం జరిగింది. గోల్కొండ రిసార్ట్‌లో ఈటల, రేవంత్ రెడ్డి కలిశారు. మా దగ్గర ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. హోటల్లో పనిచేసే టీఆర్ఎస్ సానుభూతిపరులే మాకు చెప్పారు. గాంధీ భవన్లో గాడ్సేలు చేరారు. మాణిక్కం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయారు. 50 కోట్లకు పీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారు. ఈ చీకటి ఒప్పందాలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొడతారు.
— కేటీఆర్, తెలంగాణ మంత్రి
మంత్రి కేటీఆర్ ఆరోపణలపై ఈటల రాజేందర్ స్వయంగా స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలను కలిశానని స్పష్టం చేశారు. కానీ ఇటీవల కలవలేదని చెప్పారు.
రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కాదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత చాలా మందిని కలిశా. ఐనా రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో అందరి మద్దతు కోరలేదా? అభివృద్ధి కోసం చాలా మందిని కలుస్తాం.
ఈటలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఓటమి భయంతోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా బీజేపీ, కాంగ్రెస్ కలిపి పోటీ చేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాదరణను కోల్పోయాయి. ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో ఈటల గెలుపును ఎవరూ ఆపలేరు.
— రఘునందర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే
కేటీఆర్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కుమ్మక్కయ్యాయి. కేటీఆర్ వద్ద ఆధారాలుంటే చూపించాలి. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటి? వారిద్దరు ఏ పని మీదైనా కలవచ్చు. ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
గాంధీ భవన్లో గాడ్సేలు లేరు. గాడ్సేతో సంబంధం ఉన్న వారితో టీఆర్ఎస్ దోస్తీ చేస్తోంది. గల్లీలో దోస్తీ, ఢిల్లీ కుస్తీ చేస్తోంది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే. ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాయకులు కలిస్తే పార్టీ మారినట్లేనా? మంత్రి కేటీఆర్ మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారు.
— శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత
కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అక్టోబరు 8న నామినేషన్ల దాఖలు ముగిసింది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలించారు. అక్టోబరు 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 37 మంది హుజురాబాద్‌లో పోటీచేస్తున్నారు. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.