Huzurabad Bypolls: పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.33శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
పోలింగ్ తర్వాత కూడా హుజురాబాద్ (Huzurabad Bypoll) లో వేడి తగ్గడం లేదు. ఈవీఎం, వీపీప్యాట్ యంత్రాలను ప్రైవేట్ వాహనాల్లో తరలించారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సిబ్బందికి డబ్బులిచ్చి అధికార పార్టీయే ఈ పని చేయించిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి, ఇంత నీచానికి దిగజారుతారా? అని బీజేపీ (BJP) అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ (TRS)వైఖరిపై రాష్ట్రంతో పాటు కేంద్ర స్థాయిలోనూ ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం చేశారు.
''దేశచరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పటికీ రాకపోవచ్చు. వారికి ఇంతకంటే ఇలాంటి అపకీర్తి రాకపోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బుల, మద్యం వాహనాలను పోలీసులు ఎస్కార్ట్ పెట్టీ మరీ తరలించారు. డబ్బులు పంచే వారికి పోలీసులు బందోబస్తు ఇచ్చారు. డబ్బులు పెట్టి గెలిచేపద్దతి మంచిది కాదు. డబ్బులతో ఆత్మగౌరవం కొనాలని చూసారు. ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారు. ఓటు వేయడానికి వెళ్ళే ముందు కూడా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇచ్చారు. బస్సుల్లో వెళ్తున్న ఈవీఎంలను కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ నుండి కరీంనగర్‌కి గంట సేపు లోపల బస్‌లు చేరుకోవాలి. కానీ 12 గంటల వరకు కూడా చేరలేదు. EVM కరాబ్ అయినవి అని చెప్పి మార్చడం అనుమానాలకు తెరలేపింది. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా ? ఇలాంటిది ద్రోహపూరితమైనది. నీచమైనది.'' అని ఈటల రాజేందర్ విమర్శించారు.
తనను ఓడించడానికి కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు. డబ్బులు, మద్యం విపరీతంగా పంచారని, ఓటర్లను బెదిరించారని ఆరోపించారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు ఈటల. అన్నీ చేసిన కూడా గెలవలేక.. ఈవీఎంలను మార్చుతున్నారని బాంబు పేల్చారు. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి వేసిన ఓటును కూడా మాయం చేయడం దుర్మార్గం, అన్యాయమని విరుచుకుపడ్డారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర , ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. EVM మార్చే ప్రయత్నం పట్ల హుజురాబాద్ ప్రజలు ఆందోళన చెందవద్దని..అంతిమ విజయం ధర్మానిదేనన్నారు ఈటల.
''ఓడిపోతామనే భయంతోనే సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే వీవీ ప్యాట్లను కారులో తరలించారు. వీవీ పనిచేయడం లేదని ఏజెంట్లకు తెలపకుండా ఎట్లా నిర్దారించారు? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తేలడంతో CM KCR డైరెక్షన్లో మరో దొంగాటకు తెరదీశారు. వీవీ ప్యాట్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా కారులో ఎట్లా తరలిస్తారు. అసలు వీవీప్యాట్లు పనిచేయడం లేదనడానికి మీరు ఎవరు? పని చేయడం లేదని మీరెలా నిర్దారించారు?ఎవరికి చెప్పకుండా ఎలా తరలిస్తారు? నిజంగా పనిచేయకపోతే పోటీ చేసిన అభ్యర్థులకు,ఏజెంట్లకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాలి '' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
కాగా, పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.33శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయింది. పెరిగిన ఓటింగ్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది తెలియాల్సి ఉంది. నవంబరు 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.