Huzurabad By Poll: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ పోటీ చేయడం లేదా..? ప్రచారంలో జమున ఆసక్తికర వ్యాఖ్యలు..

మీడియాతో మాట్లాడుతున్న ఈటల జమున

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడనే దానిపై ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

 • Share this:
  తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడనే దానిపై ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. అలాగే ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే దానిపై తీవ్ర చర్చ సాగుతుంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలుస్తారని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు ఆయన పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తాను కూడా బరిలో నిలిచే అవకాశం ఉందని విధంగా వ్యాఖ్యలు చేశారు.

  ఈటల రాజేందర్ బరిలో ఉన్న.. తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నప్పుడు తాను ప్రచారం నిర్వహించానని గుర్తచేశారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. అయితే ఎవరు పోటీ చేసినా గుర్తు ఒకటే ఉంటుందని జమున స్పష్టం చేశారు. ఇక, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో.. ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ జమున ప్రచారం నిర్వహిస్తున్నారు.

  ఇంకా జమున మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలక వ్యక్తిగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాలని అంటున్నారని చెప్పారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని ప్రజలు అంటున్నట్టుగా తెలిపారు. ప్రచారంలో కూడా అడుగడుగునా బీజేపీ కార్యకర్తలను, మహిళా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మనం తెలంగాణలో ఉన్న మా పాకిస్తాన్ లో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తప్పకుండా పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

  మరోవైపు ఈటల రాజేందర్ హుజూరాబాద్​లో రేపటి నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. రేపు ఉదయం 7:30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. 22 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో నియోజకవర్గంలోని మొత్తం 125 గ్రామాల్లో ఈటల పర్యటించనున్నారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రోజుకు 5 గ్రామాల్లో పర్యటించేలా ప్లాన్ రూపొందించారు. మరోవైపు హుజురాబాద్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఎవరిని బరిలో నిలిపుతుందనే దానిపై స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
  Published by:Sumanth Kanukula
  First published: