Home /News /politics /

HUZURABAD BY ELECTION 2021 CM KCR CONSIDERING POLICE OFFICER PRASHANTH REDDY AS TRS CANDIDATE TO CONTEST AGAINST EETALA RAJENDER SK

Huzurabad: ఈటలపై ఆ పోలీస్‌ను పోటీకి దింపే యోచనలో టీఆర్ఎస్? కేసీఆర్ వ్యూహం ఇదేనా..

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫొటోస్)

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫొటోస్)

Huzurabad by election 2021: గతంలో జమ్మికుంట సీఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బయోడేటాను తెప్పించుకున్నట్లు సమాచారం.

    మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన తర్వాత ప్రజలందరి దృష్టి హుజూరాబాద్‌పై పడింది. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఈటలపై ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. నియోజకవర్గంలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా మాటల తూటాలను పేల్చుతున్నారు. కార్యకర్తలతో వరుస సమావేశాలు, రోడ్‌ షోలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదు. ఈటల రాజేందర్‌ను ఓడించే బలమైన నేత కోసం సీఎం కేసీఆర్ వెతుకున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు ముద్దసాని పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కృష్ణమోహన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఐతే తాజాగా ఎవరూ ఊహించని ఓ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

    గతంలో జమ్మికుంట సీఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బయోడేటాను తెప్పించుకున్నట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి స్వస్థలం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామం. ఇక్కడ పుట్టి పెరగడంతో పాటు జమ్మికుంటలో సీఐగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడం ప్రశాంత్ రెడ్డికి కలిసివచ్చే అంశాలు. 2017లో జమ్మికుంటలో నిత్య జాతీయ గీలాపనకు ఆయనే శ్రీకారం చుట్టారు. యువతలో దేశభక్తి పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈయన వేరొక చోటుకు బదిలీ అయినా ఇప్పటికీ ఆ కార్యక్రమం కొనసాగుతోంది. నిత్య జాతీయ గీలాపన విషయంలో జాతీయస్థాయిలో జమ్మికుంట ఆదర్శకంగా నిలిచింది. జమ్మి కుంటను చూసి చాలా గ్రామాల్లో నిత్య జాతీయ గీలాపన కార్యక్రమం జరుగుతోంది. ఆ క్రెడిట్ అంతా ప్రశాంత్ రెడ్డికే దక్కుతుంది. మొత్తంగా హుజూరాబాద్ ప్రజలకు ప్రశాంత్ రెడ్డి సుపరిచితమైన వ్యక్తి. మంచి అధికారిగా పేరు ఉండడంతో ఆయన్ను ఉపఎన్నికల్లో బరిలోకి దించే అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. జనరల్ స్థానమైన హుజూరాబాద్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపడం ద్వారా ఎవరూ ఊహించని విధంగా ప్రత్యర్థులకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాకలో రెడ్డి వర్గానికి చెందిన వారికి, నాగార్జునసాగర్‌లో బీసీ వర్గానికి చెందిన భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎస్సీ వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఐతే అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు సర్వేలు చేయిస్తున్నారని, వాటి నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుంటున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు