AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.., ఎంతమంది పోటీలో నిలిచారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో (Andhra Pradesh Panchayat Elections) తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జనవరి 29 నుంచి 31వరకు మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జనవరి 29 నుంచి 31వరకు మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం 5గంటలకే నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసినా.., పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నామినేషన్లు ఫైల్ చేశారు. 12 జిల్లాల పరిధిలోని దాదాపు 175 మండలాల్లో 3,251 గ్రామ పంచాయతీలు, 32,522 వార్డులకు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 19, 491, వార్డు సభ్యుల స్థానాలకు 79, 799 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం సాయంత్రం 5గంటల వరకే సమయం ఉన్నా.. నిర్ణీత సమయంలో కార్యాలయాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చిన అధికారులు అర్ధరాత్రి 12గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు తెలుస్తోంది.

    జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 321 సర్పంచ్ స్థానాలకు 1,772 నామినేషన్లు దాఖలవగా.., 2,920 వార్డులకు 6,382 నామిన్షన్లు దాఖలయ్యాయి. విశాఖ జిల్లాలోని 340 సర్పంచ్ స్థానాలకు 2,009.., 3,250 వార్డులకు 9,525 నామినేషన్లు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 366 సర్పంచ్ స్థానాలకు 2,135.., 4,100 వార్డులకు 12,293 మంది నామినేషన్లు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 239 సర్పంచ్ స్థానాలకు 1,415.., 2552 వార్డులకు 6639 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో 234 సర్పంచ్ స్థానాలకు 1,379.., 2,502 వార్డులకు 7,889 నామినేషన్లు, గుంటూరు జిల్లాలోని 337 పంచాయతీలకు 1,745, 3,442 వార్డులకు 8019 నామినేషన్లు దాఖలయ్యాయి.

    ఇది చదవండి: వైసీపీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. సర్పంచ్ అభ్యర్థుల్లో టెన్షన్..


    ప్రకాశం జిల్లాలో 229 సర్పంచ్ స్థానాలకు 1372.., 2344 వార్డులకు 5923., నెల్లూరు జిల్లాలో 163 సర్పంచ్ పదవులకు 959.., 1566 వార్డులకు 3923 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు జిల్లాలో 454 సర్పంచ్ స్థానాలకు 2890.,. 4142 వార్డులకు 6821.., కడప జిల్లాలో 206 సర్పంచ్ స్థానాలకు 1477.., 2068 వార్డులకు 4265 నామినేషన్లు, కర్నూలు జిల్లాలో 193 సర్పంచ్ పదవులకు 1243.., 1922 వార్డులకు 4420 నామినేషన్లు, అనంతపురం జిల్లాలో 169 సర్పంచ్ స్థానాలకు 1095.., 1714 వార్డులకు 3,080 మంది నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు.

    తొలిదశ పోలింగ్ లో నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలిగం ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలను వెల్లడిస్తారు.
    Published by:Purna Chandra
    First published: