హోమ్ /వార్తలు /politics /

AP Panchayat Elections: కుక్కర్లు, గౌన్లు, స్టూళ్లు కోళ్లకు డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..

AP Panchayat Elections: కుక్కర్లు, గౌన్లు, స్టూళ్లు కోళ్లకు డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..

ఏపీలో పంచాయతీ ఎన్నికల గుర్తులకు పెరిగిన డిమాండ్

ఏపీలో పంచాయతీ ఎన్నికల గుర్తులకు పెరిగిన డిమాండ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎలక్షన్స్ (AP Panchayat Elections) ఎఫెక్ట్ తో మార్కెట్లోని కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల గుర్తులకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయి.

  మన దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ ఏదైనా సీజన్ మొదలైందంటే దానికి సంబంధించిన వస్తువులకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది. కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, హ్యాండ్ వాష్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇప్పుడు కూడా అది కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ తో మార్కెట్లోని కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల గుర్తులకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గుర్తులను పోలిన వస్తువులను ఓటర్లకు పంచుతున్నారు. కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూళ్లు, గౌన్లు ఇలా తమ సింబల్స్ ను ఓటర్లు గుర్తుంచుకునేలా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు పంచడానికే కాదు.. ప్రచారానికి కూడా ఈ వస్తువులను వినియోగిస్తున్నారు.

  ఎన్నికల్లో అభ్యర్థులకు కుక్కర్లు, గౌన్లు, స్టూళ్లు మాత్రమే కాదు.. మంచాలు, కత్తెర్లు వంటివి కూడా వచ్చాయి. దీంతో చిన్నచిన్న మంచాలు తయారు చేయించి ప్రచారం చేస్తున్నారు. ఇక చిన్నసైజులో ఉండే సరిగా కనిపించవుగనుక.. పెద్ద సైజ్ బొమ్మ కత్తెర్లను తయారు చేయించి ప్రచారం చేస్తున్నారు. మంచాల, కత్తెర్ల సంగతి ఎలా ఉన్నా..ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు, స్టూల్స్ కి మాత్రం కొరత వచ్చిపడింది. ఒకేసారి వేలాది మంది అభ్యర్థులు సర్పంచ్, వార్డు మెంబర్ బరిలో ఉండటంతో ఓటర్ల సంఖ్యకు తగ్గట్లుగా వస్తువులు పంచాల్సి వస్తోంది. అభ్యర్థులు, వారి అనుచరులు ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

  ఇది చదవండి: పంచాయతీ ఎన్నికల్లో భగ్గుమన్న కక్షలు... యువకుడికి కత్తిపోట్లు  తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లు.. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలా మంది తమకు గుర్తులుగా కేటాయించిన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూళ్లను ఎగబడి కొనేశారు. తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్‌ పెరిగింది. వార్డుల్లో సాదారణంగా 100 నుంచి 400 ఓట్ల వరకు ఉంటాయి. తొలి విడతలో ఓ వంద మందికి పంచి.. తర్వాత మిగిలిన వారికి పంచుదామంటే మార్కెట్లో కుక్కర్లు, స్టూళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కోనసీమ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సగం మందికి పంచి.. మిగిలిన వారికి పంచకుంటే ఓట్లు పడవేమోనని కంగారు పడిపోతున్నారు.

  కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చికెన్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ఇంటికో కోడిని పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ అభ్యర్థి ఇంటికి ఒక కోడిని ఇస్తే.. ప్రత్యర్థులు రెండు కోళ్లను పంచుతున్నారు. దీంతో గ్రామాల్లో కోళ్లకు కూడా గిరాకీ వచ్చిపడింది. కొన్నిచోట్ల డిష్ టీవీ కనెక్షన్లు కూడా ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.

  గుర్తులకు సంబంధించిన వస్తువుల పంపిణీపై ఓటర్లు మాత్రం జోకులు పేల్చుతున్నారు. కుక్కర్లు, గౌన్లు, స్టూల్ గుర్తులు వచ్చాయి కాబట్టి పంచుతున్నారు. అందే ఉంగరాలు, బైకులు, కార్లు, ట్రాక్టర్ల వంటి గుర్తులు వస్తే ఈ అభ్యర్థలంతా ఏం చేసేవారోనని  జోకులు కూడా పేల్చుతున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకేమోగానీ... వ్యాపారస్తులకు మాత్రం బాగానే కలిసొచ్చాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Chicken, Gram Panchayat Elections, Local body elections, Telugu news

  ఉత్తమ కథలు