HUGE CASH FLOATING IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS CANDIDATES READY GIVE ANYTHING TO VOTERS HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: ఓటుకు రూ.30వేలు... పంచాయతీ ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు...
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ప్రలోభాలపర్వం పీక్స్ కి చేసింది. నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం పీక్స్ కి చేసింది. నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రతిష్టకు పోయి ఓట్ల కోసం లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీల కింద కుటుంబాలకు డబ్బులిస్తూ చివరి నిముషం వరకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆంక్షలు, అడ్డంకులు దాటుకొని ఇంటింటికీ తిరుగుతూ తాయిలాలు ఇస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓటుకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు ఎక్కువకావడంతో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆన్ లైన్లోనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. యువ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు క్రికెట్ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నారు.
వట్టిచెరుకూరు మండలంలోని వందల సంఖ్యలోనే ఓట్లున్న ఓ గ్రామంలో ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు పంచుతున్నారు. సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నువ్వానేనా అనే స్థాయిలో పోటీపడుతుండటంతో ఓటర్ల పంట పండుతోంది. అదే ఆ ఓటరు ప్రత్యర్థి పార్టీకి చెందినవాడైతే ఎంతైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఓ అభ్యర్థి గ్రామంలో మూడు ఓట్లున్న ఓ కుటుంబానికి ఏకంగా రూ.లక్ష రూపాయలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల ఒక్కో ఓటుకు లెక్క కాకుండా.. కుటుంబంలో ఉన్న ఓట్లన్నింటికీ కలిపి ప్యాకేజీలిచ్చేస్తున్నారు. ఈ లెక్కన లక్షల్లో తీసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయట.
ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి ఖర్చు ఒక్కో గ్రామంలో కనీసం రూ.20 లక్షల నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తనకున్న ఎకరం భూమిని విక్రయించి ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ముప్పాళ్ల మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు రూ.5వేలకు తక్కువ కాకుండా ఇస్తున్నారు. అమరావతి మండలంలోనూ కాసుల గలగలలే కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఒక్కో ఓటుకు ఎంత పంచుతున్నాడో తెలుసుకొని ఆ తర్వాత పంచుతున్నారు. డబ్బులే కాకుండా విందులు, మందుపార్టీలు అదనం. డబ్బులతో పాటు ఎన్నికల గుర్తులను పోలిన వస్తువులను గిఫ్టులుగా ఇస్తున్నారు. కుక్కర్లు, స్టూళ్లు, గౌనులు ఇతర గిఫ్టులను ఇస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లు.. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలా మంది తమకు గుర్తులుగా కేటాయించిన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూళ్లను ఎగబడి కొనేశారు. తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. వార్డుల్లో సాదణరణంగా 100 నుంచి 400 ఓట్ల వరకు ఉంటాయి. తొలి విడతలో ఓ వంద మందికి పంచి.. తర్వాత మిగిలిన వారికి పంచుదామంటే మార్కెట్లో కుక్కర్లు, స్టూళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కోనసీమ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సగం మందికి పంచి.. మిగిలిన వారికి పంచకుంటే ఓట్లు పడవేమోనని కంగారు పడిపోతున్నారు.