ఎన్నికలు సమీపిస్తుండటంతో... బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు... ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానిపై జరిగే బెట్టింగ్‌లు అప్పుడే మొదలైనట్టు తెలుస్తోంది. ఒకటి రెండింతులు, మూడింతలుగా బెట్టింగ్ కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. బుకీలు కూడా అప్పుడే బెట్టింగ్స్‌కు సంబంధించిన దుకాణాలు తెరిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారే ఈ బెట్టింగ్ బిజినెస్‌లో ఈ సారి ఏపీలోని ఇద్దరు నాయకులపైనే బెటింగ్ రాయుళ్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ గెలుపుతో పాటు ఆయనకు రాబోయే మెజార్టీపై బెట్టింగ్‌లు ఎక్కువగా వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలో లోకేశ్‌కు గెలుపు అంత సులువు కాదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో... దీనిపై బెట్టింగ్ రాయుళ్లు కూడా లక్షల్లో పందాలు కాస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో ఉన్న సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు గెలుపుపై కూడా జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు గెలుస్తారా లేదా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బుకీలు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల గెలుపు ఓటములతో పాటు టీడీపీ, వైసీపీ గెలుపు, ఓటములపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్స్ మొదలైనట్టు సమాచారం. ఈ మొత్తం బెటింగ్స్ రూ. 2 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. మొత్తానికి టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు... మరోసారి బుకీలకు కాసుల వర్షం కురిపించేలా కనిపిస్తోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.