Home /News /politics /

HOW THE NEW AGRICULTURE BILLS ANGERED FARMERS PUSHED AKALI DAL TO QUIT GOVT GAVE AMMO TO OPPN SK

కొత్త వ్యవసాయ బిల్లుల్లో ఏముంది? కేంద్రమంత్రి రాజీనామాకు కారణమేంటి? రైతుల ఆందోళన ఎందుకు?

రైతుల ఆందోళన

రైతుల ఆందోళన

అనూహ్య పరిణామం తర్వాత అసలు ఆ బిల్లులేంటి? కేంద్రమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? రైతుల అభ్యంతరాలేంటి? అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయింది.

  పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ఉత్తరాదిన దుమారం రేగుతోంది. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. విపక్షాలు మాత్రమే కాదు.. బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత హర్‌సిమత్ర్ కౌర్ ఏకంగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లులతో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ బంధానికి బీటలు వారాయి. రైతులకు నష్టం చేకూర్చే బిల్లులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదంటూ మోదీ కేబినెట్ నుంచి ఆమె బయటకు వచ్చారు. 'రైతు వ్యతిరేక చట్టాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రిపదవికి రాజీనమా చేశాను. రైతులకు కూతురిగా, సోదరిగా వారి పక్షాన నిలబడినందుకు గర్వంగా ఉంది.' అని హర్‌సిమత్ర్ కౌర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అనూహ్య పరిణామం తర్వాత అసలు ఆ బిల్లులేంటి? కేంద్రమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? రైతుల అభ్యంతరాలేంటి? అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయింది.

  వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని మండిపడుతున్నాయి.

  ఈ బిల్లులను అకాలీదళ్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
  పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీకి రైతులే అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. 2017కు ముందు పంజాబ్‌లో అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి.. ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంగా పూర్తిగా పట్టుకోల్పోయింది. ఒకరకంగా చెప్పాలంటే అకాలీదళ్‌కు ఇది జీవన్మరణ సమస్య. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమని అకాలీదళ్-బీజేపీ కూటమికి కేవలం 15శాతం మాత్రమే వచ్చాయి. అదే సమయంలో 1957 తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద విజయం దక్కింది. అందుకే రైతులను తమవైపు తిప్పుకొని రాష్ట్రంలో మళ్లీ బలపడేందుకు కొత్త వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అకాలీదళ్.

  రైతులకు భయం ఎందుకు?
  ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే తమ పంటకు కనీస మద్దతు ధర రాదని ఆందోళన చెందుతున్నారు. అటు కమిషన్ ఏజెంట్లు కూడా తమ కమిషన్ కోల్పోతామని వాపోతున్నారు. పంజాబ్ వ్యవసాయ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల రైతు కుటుంబాలు, 12 లక్షకు పైగా రిజిస్టర్డ్ కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. రైతు ఉత్పత్తులను సేకరించే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వంటి సంస్థల నిధులపైనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ వ్యవసాయ సంస్కరణలతో.. రాష్ట్ర వ్యవసాయ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను FCI చేపట్టదని రైతులు వాపోతున్నారు. అప్పడు దళారులు చెలరేగిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి FCI ద్వారా వచ్చే 6శాతం కమిషన్ ఆదాయం కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

  మద్దతు ధర లభించదా..?

  రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020 ప్రకారం.. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC)ల బయట కూడా ధాన్యం అమ్ముకునే వెసులుబాటును రైతులకు కల్పిస్తారు. అంటే ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ పంటను అమ్ముకోవచ్చు. అంతేకాదు పంటల ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు, సెస్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయకూడదు. తద్వారా రైతుకు న్యాయం జరుగుతుందని కేంద్రం చెబుతోంది. PRS రీసెర్చ్ ప్రకారం.. అమ్మకందారుడు, కొనుగోలుదారుడి మధ్య సవ్యంగా వ్యాపారం జరిగేలా చూడడమే AMPCల ఉద్దేశ్యం. కొనుగోలు దారులు, కమిషన్ ఏజెంట్లు, ప్రైవేట్ మార్కెట్‌లకు లైసెన్స్‌లు మంజూరుచేసి ఉత్పత్తులను నియంత్రిస్తారు. మార్కెట్‌లో సదుపాయల కల్పనకు APMCలు చార్జీలు వసూలు చేస్తాయి. 'కేంద్రం వన్ నేషన్ వన్ మార్కెట్' అంటుంటే.. విమర్శలు మాత్రం 'వన్ నేషన్ వన్ ఎంఎస్‌పీ' అంటున్నారు. రైతు ఉత్పత్తుల ధరకు ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఐతే విపక్షాలు మాత్రం మద్దతు ధర లభించదని.. ప్రైవేట్ వారు ఎంత చెబితే అంతకే అమ్ముకోవాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు.

  ఆహార కొరతకు దారితీస్తుందా?
  ఆహార ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేయడంతో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా పంటలు కోతకు వచ్చే సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి భద్రపరచుకుంటారు. ఆ తర్వాత ధరలను పెరిగిన తర్వాత అమ్ముకుంటారు. ఎప్పుడు ఎక్కువ రేట్లు ఉంటే అప్పుడు అమ్ముకోవడం వలన మిగిలిన సమయంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందన్న అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. రాష్ట్రాల్లో ఎంత మేర నిల్వలు ఉన్నాయన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేయలేవని అమరీందర్ సింగ్ తెలిపారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Farmers Protest

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు