రెండో సారి అధికారం చేపట్టాక మోదీ సర్కారు సంచలన నిర్ణయాలు, చట్టాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముస్లిం మహిళలకు వరమైన ట్రిపుల్ తలాక్ బిల్లును చట్టం చేసిన బీజేపీ ప్రభుత్వం.. ఈ రోజు జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అలాగే, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అదీకాక, ఆ రాష్ట్రం నుంచి లదాఖ్‌ను విభజించి దాన్ని మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. ఫలితంగా భారతదేశం 28 రాష్ట్రాలను, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిగి ఉండనుంది. ఎన్నికల్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చిన బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎన్నో రోజులుగా కసరత్తు చేస్తున్నా.. పది రోజులుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఎలా సాగాయంటే..
జూలై 27: కశ్మీర్ లోయకు 100 కంపెనీల సైనిక బలగాలను తరలించారు.
జూలై 28: 35ఏ రద్దు చేస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
జూలై 29: రాష్ట్రంలోని మసీదులు, కమిటీల నుంచి పోలీసులు వివరణ కోరాయి.
జూలై 30: సైనిక బలగాలతో యుద్ధవాతావరణం నెలకొంది. మెరుపు దాడులు, వైమానిక దాడుల లాంటి మరో ఘటన పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అక్కడి ప్రజలు భయపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్లలో క్యూలు కట్టారు.
జూలై 31: 35ఏ వల్ల కలిగే ప్రయోజనాలను జమ్మూకశ్మీర్ ప్రజలకు మెహబూబా ముఫ్తీ వివరించడం మొదలుపెట్టారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఆగస్టు 1: మరో 25వేల కేంద్ర బలగాలను కశ్మీర్ లోయకు తరలించారు.
ఆగస్టు 2: అమర్నాథ్ పర్యటనను రద్దు చేసి, ఉన్నఫలంగా పర్యాటకులంతా రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలని ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించింది.
ఆగస్టు 3: 370ని రద్దు చేస్తారని ప్రచారం జోరందుకుంది. అయితే, వదంతులు నమ్మవద్దని, అంతా యథాతథమని గవర్నర్ ప్రకటించారు.
ఆగస్టు 4: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. అదే రోజు అర్ధరాత్రి కశ్మీరీ నేతలను గృహ నిర్బందం చేశారు.
ఆగస్టు 5: ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేయడంతో 35ఏ కూడా రద్దైంది. అదీకాక, జమ్మూకశ్మీర్‌ను విభజించి లదాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు.