HOUSE CONSTRUCTIONS DEMOLITION ISSUE TOOK POLITICAL TURN IN NARASARAOPETA IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH LOCALS MADE ALLEGATIONS ON YSRCP MLA GOPIREDDY SRINIVAS REDDY HERE ARE THE DETAILS PRN GN
Andhra Pradesh: ఇళ్ల ముందు మెట్లు కూల్చివేత... వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు
నరసరావుపేటలో ఇళ్ల ముందు మెట్ల కూల్చివేతపై రాజకీయ వివాదం
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య వార్ సీరియస్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఇన్సుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో శిశుమందిర్ వద్ద ఇళ్ల ముందు మెట్లు, డ్రెయినేజీ ర్యాంపుల తొలగింపు అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. క్రమంగా ఇది రాజకీయ రంగు పలుముకుంటోంది. గ్రామంలోని ఇళ్ల ముందు డ్రెయిన్ పై నిర్మించిన మెట్లు, ర్యాంపులను పంచాయతీ అధికారులు కూల్చివేశారు. దీనిపై స్థానికులు ప్రశ్నించగా.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్తున్నట్లు తెలిసింది. అధికారులు చెప్తున్న సమాధానంపై స్థానికులు మండిపడుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వలేదన్న కక్షతో తమ ఇళ్ల ముందు నిర్మాణాలను కూల్చివేయించారని మండిపడుతున్నారు. మీ రాజకీయాలకు తమను బలిచేయొద్దంటూ వేడుకుంటున్నారు. కూల్చివేతల సమయంలో స్థానికులు జేసీబీలను అడ్డంగా పడుకున్నా పోలీసుల సాయంతో అధికారులు తమ పని పూర్తి చేశారు.
ప్రైవేట్ వెంచర్లో ఇళ్ల నిర్మాణం సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తమను డబ్బులు డిమాండ్ చేశారని.. అందుకు నిరాకరించడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో మద్దతివ్వనందుకే ఎమ్మెల్యే ఈ కక్షసాధింపుకు పాల్పడుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులున్నా అక్రమం కట్టడాల పేరుతో కూల్చడం దారణంటూ నరసరావుపేట టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడు అరవిందబాబు విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పరిశీలన కోసం తెలుగుదేశం పార్టీ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవింద బాబు నేతృత్వంలోని కమిటీ ఘటనాస్థలిని పరిశీలించింది.
వైసీపీకి ఓట్లు వేయనివారి ఇళ్లను కూల్చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ఆరోపించారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టినా కూల్చి వేయటం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుసుకోవాలని డిమాండ్ చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.