AP Municipal Elections: హిందూపురంలో బాలయ్యకు చెక్.. ఓటమికి అదే కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు

బాలయ్యకు షాక్

బాలయ్య అడ్డా హిందూపురంలో టీడీపీ ఓటమికి కారణం ఏంటి? స్వయం తప్పిదాలే బాలయ్య కొంప ముంచాయా? ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి అండగా వస్తున్నట్టు ఓటర్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీ టర్న్ తీసుకున్నారా? మరి హిందూపురంలో బాలయ్య భవిష్యత్తు ఏంటి?

 • Share this:
  గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఏపీలో తన జోరుకు బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది వైసీపీ. ఎన్నికలు ఏవైనా వార్ వన్ సైడ్ అవుతోంది. మొన్న పంచాయితీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడు చూపిస్తోంది. ఈ సారి ప్రముఖుల కంచు కోటను సైతం వైసీపీ బద్దలు కొట్టింది. ముఖ్యంగా హిందూపురం తన అడ్డా అనుకునే బాలయ్యకు చెక్ పెట్టింది. ఒక్క తాడిపత్రి మినహా.. అనంతపురం జిల్లా మొత్తం ఫ్యాన్ గాలి వీచింది. అయితే హిందూపురంలో ఫ్యాన్ దూకుడుకు బాలయ్య అడ్డుకట్ట వేస్తారని టీడీపీ నేతలు. తెలుగు తమ్ముళ్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

  నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా జనాలు వైసీపీకే జై కొట్టారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ప్రజలు టీడీపీకి మద్దుతుగా ఉన్నారు. కానీ ఈసారి సీన్ మారింది. హిందూపూర్ మున్సిపాలిటీని వై‌సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో వైసీపీ 27, టీడీపీ 6, బీజేపీకి 1, ఎంఐఎం 1, ఇతరులు 1 వార్డును గెలచుకున్నారు.

  ఈ మున్సిపల్ ఎన్నికల్ని బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. షూటింగ్ నిలిపివేసి మరీ ప్రచారబరిలొ దిగారు. భేషజాలు పక్కన పెట్టి.. ప్రతి అభ్యర్థి తరపున స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అలాగే ఏకగ్రీవాలను సైతం సమర్థవంతంగా అడ్డుకున్నారు. విబేధాలు లేకుండా నాయకులందర్నీ సమన్వయపరుస్తూ ముందుకెళ్లారు. ఆయన డెడికేషన్ చూసినవాళ్లందరూ టీడీపీ గెలుపు పక్కా అనుకున్నారు. కానీ హిందూపురం ఓటర్లు మాత్రం వైసీపీకే మద్దతుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్‌ ఎదుర్కుని మరీ గెలిచిన బాలయ్య, మొన్న పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు మున్పిపల్ ఎన్నికల్లో చతికిలపడ్డారు. హిందూపురంలో వైసీపీకి చెక్ పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు వైసీపీ కూడా అంతే సీరియస్ గా తీసుకొని ప్రచారం చేసింది.

  గత ఎన్నికల్లో టీడీపీ 19, వైసీపీ 19 వార్డులు కైవసం చేసుకోగా.. ఎక్స్ అఫీషియో ఓట్లతో టీడీపీ ఛైర్మన్ స్థానాని దక్కించుకుంది. ఐతే ఈసారి ఎక్స్ అఫిషియో ఓట్లతో పనిలేకుండానే ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యపై ఓటమిపాలైన మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ దవి ఇచ్చిన వైసీపీ అధిష్టానం.. ఆయనకు హిందూపురం మున్సిపాలిటీలో విజయాన్ని టార్గెట్ గా పెట్టింది. అందుకు తగ్గట్లుగానే బాలయ్యకు ధీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఫ్యాన్ గ్యాలి బలంగా వీచింది.

  ఇదీ చదవండి: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్: సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థులను తీసుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి: చైర్మన్ పదవిపై వైసీపీ ఫోకస్

  అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లోనూ హిందూపురంలో వైసీపీ హవా కనిపించింది. అక్కడి రూరల్ ఓటర్లు బాలయ్యకు షాకిచ్చారు. ఇప్పుడు కూడా పట్టణాల్లో అదే సీన్ రిపీట్ అయ్యింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ భారీగా ప్రలోభాలకు పాల్పడిందని.. తమ పార్టీ అభ్యర్థులు గెలిచినా.. వైసీపీ అభ్యర్థులుగా ప్రచారం చేసిందని హిందూపురం టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు మాత్రం  ఓటమికి స్వయం తప్పిదాలే కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న బాలయ్య సొంత అభిమానిపై చేయి చేసుకోవడం మైనస్ అయ్యిందని.. అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని బాలయ్యకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు.  కానీ ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించకపోతే.. హిందూపురంలో భవిష్యత్తులోనూ బాలయ్యకు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: