తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ, మరో వ్యక్తి శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేబినెట్ అంగీకారం ప్రకారం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు స్పష్టం చేసింది. అది రాజ్యాంగ ప్రకారమే కల్పించిన హక్కుగా హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కొద్ది రోజుల క్రితం డీకే అరుణ, శశాంక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీని రద్దు చేయడానికి ముందు సభను సమావేశపరచలేదని, అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లిందని, కేబినెట్ కూడా సమగ్రంగా చర్చించకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే నిర్ణయం తీసుకుందని పిటిషన్లో ఆరోపించారు. అయితే, వారి పిటిషన్లపై ఒక రోజు మొత్తం వాదనలు జరిగాయి. వాటిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డీకే అరుణ, శశాంక్ రెడ్డి పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయమే ఫైనల్ అని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేయడానికి మెజారిటీ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయని వాదించారు. ప్రభుత్వం వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. అసెంబ్లీ రద్దు మీద దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.