Home /News /politics /

HIGH COURT SLAMS AP GOVERNMENT IN THREE CASES SB

ఎన్నికల వేళ ఏపీకి ఎదురుదెబ్బలు... చిక్కుల్లో టీడీపీ సర్కార్

చంద్రబాబు (File)

చంద్రబాబు (File)

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలను ఏప్రిల్ 3వ తేదీ వరకూ తాత్కాలికంగా వాయిదా వేయించినా …. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్ధితి

  సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్

  ఎన్నికల వేళ ఏఫీ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాథవ్ వీఆర్ఎస్ వ్యవహారంలో, ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయగా.. తాజాగా ఇవాళ వివేకానందరెడ్డి హత్య కేసులో బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం సర్కారుకు ఇబ్బందికరంగా మారనుంది. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలను తాత్కాలికంగా వాయిదా వేయించగలిగినా.. మరో నాలుగు రోజుల్లో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
  ఏపీలో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.... న్యాయస్ధానాల్లో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు టీడీపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెడుతున్నాయి.

  హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా.... పెండింగ్ లో ఉన్న ఆయన వీఆర్ఎస్ కు ఆమోదం తెలపకుండా ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. అడ్మినిస్ట్టేటివ్ ట్రైబ్యునల్ మాధవ్ వీఆర్ఎస్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా, చట్టబద్ధత ఉన్నా పట్టించుకోకుండా హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. మాధవ్ ను వెంటనే రిలీవ్ చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
  ఆ వెంటనే వైసీపీ నేతల ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఇంటిలిజెన్స్ ఛీప్ తో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. దీన్ని తొలుత అంగీకరిస్తూ ముగ్గురినీ బదిలీ చేసిన సర్కారు.... కొద్దిగంటల్లోనే జీవో రద్దు చేసి కేవలం ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో ఇచ్చింది. ఇంటిలిజెన్స్ ఛీఫ్ కు ఎన్నికల విధులతో సంబంధం లేదంటూ విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం... సీఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది. చివరికి కేసు విచారించిన న్యాయస్ధానం... సీఈసీ విధుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మరో జీవో జారీ చేసి ఇంటిలిజెన్స్ ఛీఫ్ వెంకటేశ్వరరావును బదిలీ చేసింది.

  మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ప్రభుత్వానికి అక్షింతలు తప్పలేదు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో రోజుకో లీక్ రావడం, టీడీపీ అధినేత చంద్రబాబు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో వైసీపీ నేతలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన హైకోర్టు.. కేసు వివరాలు బయటపెట్టొద్దంటూ పోలీసులను ఆదేశించడంతో పాటు వివేకా హత్యపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ రాజకీయ పార్టీల నేతలతో పాటు అందరికీ వర్తించేలా అదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలన్న టీడీపీ వ్యూహం చిత్తయింది.

  వారం రోజుల వ్యవధిలో మూడు కీలక కేసుల్లో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఎన్నికల వేళ టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఆయా కేసుల్లో వాదిస్తున్న ఏజీతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు సైతం న్యాయస్ధానాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలను ఏప్రిల్ 3వ తేదీ వరకూ తాత్కాలికంగా వాయిదా వేయించినా …. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్ధితి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Chandrababu naidu, High Court, Tdp, YS Vivekananda reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు