ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతిపై (Capital Amaravathi) దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని.. అమరావతి రైతుల రాజధానే కాదని.. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి.. విశాఖ, కర్నూలుతో సహా అందరిది అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా సీజే ప్రస్తావించారు. స్వాతంత్ర్య సమరయోధులు తమ కోసమే పోరాడలేదని.. దేశ ప్రజలందరి కోసం పోరాడారని గుర్తుచేశారు.
ఏపీ ప్రభుత్వం (AP Government) ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో 57 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఈనెల 15 నుంచి రోజువారీ విచారణ జరుగుతోంది. తొలిరోజు విచారణ సందర్భంగా విచారణ బెంచ్ నుంచి జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణను తొలగించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని.. దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. దీని వల్ల కక్షిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని సీజే అన్నారు.
2019 డిసెంబర్లో అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆమరావతి ప్రాంత రైతులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లును రద్దూ చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా మండలిలో మాత్రం నెగ్గలేకపోయింది. ఈ నేపథ్యంలో రాజధాని అంశం కోర్టుకు చేరింది.
ఓ వైపు రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. అమరావతి ప్రాంత రైతులు న్యాయస్తానం to దేవస్థానం పేరుతో మహాపాదయాత్రను చేపట్టారు. పాదయాత్ర సందర్భంగానే రాజధాని ఉద్యమం 700వ రోజుకు చేరింది. రెండు వారాల క్రితం ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 45 రోజుల పాటు నిర్వహించే యాత్ర డిసెంబర్ 15న తిరుపతిలో ముగుస్తుంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని.. అది అమరావతే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక అమరావతి ఉద్యమం 700 రోజుకు చేరిన సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. రైతుల ఉద్యమం చారిత్రాత్మకమన్న ఆయన.. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మద్దతు పలికారు. అవసరమైనప్పుడు పాదాయాత్రలో పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.