ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టు విభజనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ కేంద్రం సంప్రదింపులు జరపలేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు... సమయం ఇవ్వకుండా జనవరి ఒకటి నాటికి అమరావతి వెళ్లిపోవాలని అనడం సరికాదని అన్నారు. హైకోర్టు విభజన కారణంగా నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి... జగన్ కేసులకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభించాలని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే ఆ దృష్టితో కూడా విభజన చేసినట్టుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందన్న టీడీపీ అధినేత... హైకోర్టు విభజన కారణంగా నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని తెలిపారు. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా మళ్లీ ప్రారంభించాల్సిందే అని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఏపీకి చెందిన న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో... చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హైకోర్టు భవనం ఇంకా పూర్తి కాలేదని... ఈ సమయంలో ఉన్నట్టుండి అమరావతికి హైకోర్టును మార్చడం ఎలా సాధ్యమని ఏపీ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, High Court, Tdp, Ys jagan, Ysrcp