Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తలపెట్టిన మూడు రాజధానుల ( 3 Capitals Issue) నిర్ణయానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. న్యాయపరమైన అంశాల నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఐతే ఈ బిల్లును సమగ్రంగా మరోసారి సభ ముందుకు తీసుకొస్తాని సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో ప్రకటించారు. ఈ బిల్లులోని సాంకేతిక అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయని పెద్దలు చెబుతున్నారు. ఐతే ఈ టెక్నికల్ అంశాలేంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన బిల్లులో లోపాలేంటి..? అవి ఎందకు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మారాయన్నది చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు.. హైదరాబాద్ ఇనే అభివృద్ధి చెందిన, ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని ఏపీ కోల్పోతోంది కాబట్టి... అందుకు ప్రత్యామ్నాయంగా ఒక మహానగరాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వమే తగిన సహాయం చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేకంగా రాజధాని నిర్మాణానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఏవిధంగా సాయం చేయాలనే దానిపై విభజన చట్టంలో ప్రస్తావించారు. పార్లమెంటు చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని ఒకసారి నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇక్కడ ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్చేస్తామనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజధాని నిర్ణయం ఒకేసారి ఉండాలనేది పార్లమెంట్ చట్టం స్పిరిట్. రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మరో చట్టం తీసుకురావడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్ సీఆర్డీఏలో అంతర్భాగం అయినప్పుడు, మాస్టర్ ప్లాన్ ప్రకారమే నగరాలు నిర్మిస్తామని ప్రతిపాదన చేశారు. అందుకు కొంత కాలపరిమితి కూడా పెట్టారు.
పెద్ద నగరాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు మారతాయని,విద్య, వైద్య సంస్థలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇదంతా నమ్మి రైతులు భూములు ఇస్తే .. సరైన కారణం లేకుండా, చట్ట ప్రకారం ఇచ్చిన హామీని ఉల్లంఘించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
మూడు రాజధానుల ప్రతిపాదన అనే విషయంపై ధర్మాసనం లేవనెత్తిన అభ్యంతరాల లో అసలు మూడు రాజధానులు అని రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా...? అలాగే న్యాయ రాజధాని మరియు పరిపాలన రాజధాని విషయాలపై ధర్మాసనం లేవనెత్తిన అభ్యంతరాలను సమర్ధించుకునే పరిస్థి లేక ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది.
అంతేకాక మూడురాజధానుల బిల్లు శాసన సభలో ఆమోదం పొంది శాసనమండలిలో తిరస్కరించబడిన విషయం విధితమే. ఆ తరువాత సదరు బిల్లు సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేశారు కూడా. ఐతే మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో తిరస్కరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతో చట్టబద్దత తీసుకు రావాలని ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని కొత్త బిల్లు తీసుకురావటానికి నిర్ణయించుకుని ఉండవచ్చునని తెలుస్తోంది.
ఎలాగూ తమకు శాసన సభలో మాదిరిగానే శాసన మండలిలోనూ పూర్తి సంఖ్యా బలం ఉన్నందున.. ఈసారి ప్రవేశపెట్టే బిల్లుకు ఎలాంటి ఆటంకాలుండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు సభల్లో ఆమోదం పొందితే కోర్టుల జోక్యం కూడా ఉండదని జగన్ సర్కార్ అనుకుంటోందట. అందుకే ప్రస్తుత బిల్లును వెనక్కి తీసుకొని మరింత సమగ్రంగా ప్రవేశపెట్టానున్నట్లు సీఎం ప్రకటించారని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy