ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పదవులు దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడినా ఎదో రూపంలో పదవి దక్కుతుందని భావించిన నేతల లిస్టు పెద్దదిగా ఉంది. పదవుల కోసం పార్టీ నేతల ఒత్తిడి పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలు, అశావాహులకు ఈ పదవులు కట్టబెట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడీ కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాలో పార్టీ కోసం కష్టపడిన వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో వైసీపీ అధిష్ఠానం ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. వీళ్లలో కొందరికి మంత్రి పదవులు వరించాయి.
మిగిలిన వారు ఎమ్మెల్యేలుగా పనిచేసుకుంటున్నారు. ఐతే ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన ఈ నేతలంతా నిరాశతో ఉన్నారు. ఈనేపథ్యంలో వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టాలని సీఎం జగన్ ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన 24 మందికి పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిని పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి ఇచ్చారు.
ఐతే పదవుల పంపకంలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారా..? లేక పోటీ చేసిన ఓడిన వారికి ఇస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గానికి ఒక ప్రొటోకాల్ పదవి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నారు. జాబితాకు తుదిరూపునిచ్చినా పేర్లను మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నారు.
ఇదిలా ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి నిముషంలో పార్టీ అవసరాలు, రాజకీయ సమీకరణాల వల్ల టికెట్ దక్కించుకోలేకపోయిన వారికి కూడా పదవులు దక్కనున్నాయి. అలాగే ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నవారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి చట్టసభలకు పంపుతామని సీఎం జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. ఇలాంటి నేతలే 30 మందికి పైగా ఉన్నారట. వారందరికీ ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించే పరిస్థితి లేకపోవడంతో కొందరిని నామినేటెడ్ పదవుల ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో నామినేడటెడ్ పదవులపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp