ఏపీలో వెంటాడుతున్న ఓటమి భయాలు...ఆ ఓట్లకోసం క్యూకడుతున్న నేతలు

టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగిన ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ఓటు 2 వేల నుంచి 5 వేలు పలుకుతుండగా.. గుంటూరు వంటి జిల్లాల్లో 2 వేల రూపాయల వరకూ కొనుగోలు చేస్తున్నారు.

news18-telugu
Updated: April 24, 2019, 1:38 PM IST
ఏపీలో వెంటాడుతున్న ఓటమి భయాలు...ఆ ఓట్లకోసం క్యూకడుతున్న నేతలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 1:38 PM IST
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగినట్లు తేలిపోవడంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములపై ఉత్కంఠ తారాస్ధాయికి చేరుకుంటోంది. పోలింగ్ కు చివరి క్షణం వరకూ ఓట్ల కొనుగోలు కోసం నానా తంటాలు పడిన అభ్యర్ధులు ఇప్పుడు పోస్టల్ బ్యాలట్లనూ వదలడం లేదు. గట్టిపోటీ ఎదురైన పలు నియోజకవర్గాల్లో పోస్టల్ ఓట్లను తమవైపు తిప్పుకోగలిగితే గట్టెక్కవచ్చని ప్రధాన పార్టీల అభ్యర్ధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది. టీడీపీ, వైసీపీ మధ్య ముఖామఖీ పోరు జరుగుతుందని భావించిన పలు నియోజకవర్గాల్లో జనసేన రాకతో పరిస్ధితి మారింది. వీటిలో కొన్నిచోట్ల జనసేన అభ్యర్ధులు టీడీపీ, వైసీపీ అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించే స్ధితికి చేరడం ప్రధాన పార్టీల్లో ఆందోళన రేపుతోంది. ఎన్నికల పోలింగ్ సందర్భంగా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా గెలుపుపై మాత్రం ధీమాగా లేని పరిస్ధితి అన్ని పార్టీల అభ్యర్ధుల్లోనూ నెలకొంది. ఏవో కొన్ని నియోజకవర్గాల్లో మినహాయిస్తే చాలా చోట్ల ఇదే పరిస్ధితి. దీంతో పోలింగ్ ముగిసినా తమ గెలుపు ఖాయం అవుతుందో లేదో తెలియక మరోసారి సర్వేలకు సైతం సిద్ధపడుతున్నారు.

ఈసారి రాష్ట్రంలో చాలా చోట్ల గెలిచే లేదా ఓడిపోయే అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా అతి తక్కువగా ఉండబోతుందన్న వాదన ఉంది. దీంతో వీరి చూపంతా ఇప్పుడు పోస్టల్ బ్యాలట్లపై పడింది. ఎన్నికల పోలింగ్ ముందు వరకూ పోస్టల్ బ్యాలట్ల గురించి ఆలోచించని అభ్యర్ధులు సైతం ఇప్పుడు వాటి కొనుగోలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ఈసారి పోస్టల్ బ్యాలట్ కోసం 4 లక్షల మంది ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 60 శాతం మంది తమ ఓట్లను పోస్టల్ విధానంలో ఎన్నికల అధికారులకు పంపారు. మిగతా 40 శాతం మందికి కౌంటింగ్ తేదీ అయిన మే 23 ముందు రోజు వరకూ ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో వీరిని గుర్తించి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి.

గట్టిపోటీ జరిగిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు పోస్టల్ బ్యాలట్ల కొనుగోలు కోసం తీవ్ర పోరు కొనసాగుతోంది. క్షేత్రస్ధాయిలో న్యూస్ 18 జరిపిన పరిశీలనలో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పోటీ ఆధారంగా ఒక్కో పో‌స్టల్ బ్యాలట్ ఓటును అభ్యర్ధులు వెయ్యి నుంచి 5 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగిన ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ఓటు 2 వేల నుంచి 5 వేలు పలుకుతుండగా.. గుంటూరు వంటి జిల్లాల్లో 2 వేల రూపాయల వరకూ కొనుగోలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను గుర్తించేందుకు అభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు.

స్ధానికంగా ఉండే పార్టీ నేతలు, పార్టీలకు అనుబంధంగా ఉండే ఉద్యోగ సంఘాలు, జన్మభూమి కమిటీల సభ్యుల ద్వారా పోస్టల్ ఓట్ల కోస రాయబారాలు నడుపుతున్నారు. పోస్టల్ బ్యాలట్ ఉన్న ఉద్యోగిని గుర్తించడం, గుట్టుచప్పుడు కాకుండా డబ్బు అందించడం, వారు కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా చూసుకోవడం సర్వసాధారణమవుతోంది. ఎన్నికల కౌంటింగ్ కు దాదాపు నెలరోజులు సమయం ఉన్నందున ఈ ప్రలోభాల పర్వం రాబోయే రోజుల్లో కొత్త రికార్డులకు చేరువ కావడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలట్లకు పెరిగిన డిమాండ్ చూసి అభ్యర్ధులు కూడా బెంబెలెత్తుతున్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)

 
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...