భారీ కాయం ఎవరిది? బంగారం ఎవరిది? తెలంగాణ మంత్రి ఈటల విమర్శలు ఎవరిపై?

ఈటల రాజేందర్

భారీ ఆకారం, ఒంటి నిండా బంగారం అంటూ.. ఈటల రాజేందర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇతర పార్టీలతో పాటు టీఆర్ఎస్‌లోనూ ఈటల గురించి హాట్ హాట్‌గా చర్చిస్తున్నారు నేతలు.

 • Share this:
  తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మళ్లీ వేదాంతం మాట్లాడారు. వీలు చిక్కినప్పుడల్లా ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారా? అని అనుమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. తాజాగా హుజురాబాద్‌లో ఓ రైతు వేదిక ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారీ ఆకారం, ఒండి నిండా బంగారం ఉంటే సరిపోదని, ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలని అన్నారు. న్యాయం, ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినా.. అంతిమంగా మాత్రం విజయం సాధిస్తాయని పేర్కొన్నారు.

  ''కులం, డబ్బు, పార్టీ కాదు మనిషి గుర్తుండాలి. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం వాటిదే. నేను గాయపడినా ఎన్నడూ మనసు మార్చుకోలేదు. 20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను ప్రజలు ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఊరంతా ఒకదారైతే ఊసరవెల్లిది ఇంకో దారి అనట్లుగా కొందరు ఉంటారు. మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది. రామాయణంలో కూడా రాముడు, రావణుడు ఇద్దరూ ఉన్నారు. అలాగే సమాజంలో కూడా అందరూ ఉంటారు. సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకవేళ ఉంటే అది సమాజం కాదు. భారీ ఆకారం, ఒంటి నిండా బంగారం ఉంటే సరిపోదు. ప్రజల కన్నీళ్లు చూసి స్పందించేవాడే నిజమైన నాయకుడు.'' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు

  ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు పెట్టి.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. రేపు ధాన్యం కొంటారో కొనరో అనే భయం రైతుల్లో నెలకొందని.. పంటలను కొనే ఆర్థిక స్తోమత వ్యాపారులకు లేదని చెప్పారు ఈటల రాజేందర్. ఐకేపీ సెంటర్‌లో వడ్లు కొంటేనే మహిళలకు ఉపాధి దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు ఇప్పుడిప్పుడే నాలుగు మెతుకులు అందుతున్నాయని అన్నారు. రైతుల పంటను మద్దతు ధర ప్రకారం కొనాల్సిందేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

  ఐతే భారీ ఆకారం, ఒంటి నిండా బంగారం అంటూ.. ఈటల రాజేందర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇతర పార్టీలతో పాటు టీఆర్ఎస్‌లోనూ ఈటల గురించి హాట్ హాట్‌గా చర్చిస్తున్నారు. కాగా, టీఆర్ఎస్ జెండాలు మొదట మోసింది తామేనని.. గులాబీ జెండాకు తామే బాస్‌లమని గతంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
  Published by:Shiva Kumar Addula
  First published: