HC SERIOUS ON TELANGANA AAG IN KOMATI REDDY SAMPATH CASE
కోమటిరెడ్డి-సంపత్ ఇష్యూ : హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ హైకోర్టు
తమను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను రద్దు చేయడం చెల్లదని, వాటిని పునరుద్ధరించాలంటూ గతంలో తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని తీవ్రంగా మందలించింది. దీనిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలా అని ప్రశ్నించింది. అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారా? లేకపోతే పార్టీ తరఫు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారా అంటూ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వారం రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే అసెంబ్లీ కార్యదర్శి, లా కార్యదర్శి నేరుగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ అనుచితంగా వ్యవహరించారని, సభా మర్యాదలను మంటగలిపారంటూ వారిని సభ నుంచి బహిష్కరించారు. అయితే, దీనిపై ఇద్దరు నేతలు కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న వారిని సభ నుంచి బహిష్కరించడం చెల్లదంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. వెంటనే వారిని సభ్యులుగా గుర్తిస్తూ.. గన్మెన్లను కేటాయించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం నుంచి కానీ, అసెంబ్లీ నుంచి కానీ స్పందన రాలేదు. దీంతో ఇద్దరు నేతలు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ స్పీకర్ మధుసూదనాచారిని కలిసి లేఖ అందజేసిన కాంగ్రెస్ నేతలు (File)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.