అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దాడికి సంబంధించి మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన రిటి పిటిషన్లతో పాటు మరో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. వాటికి సంబంధించిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరిపిన వివరాలను ఓ సీల్డ్ కవర్లో మంగళవారంలోగా కోర్టుకు అందించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ కొంత సమయం కావాలని కోరగా, మంగళవారం డెడ్లైన్ విధించారు.
జగన్పై హత్యాయత్నం జరిగితే దాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఏపీ డీజీపీ ఠాకూర్, సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించారని ప్రతిపక్ష నేత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం అజమాయిషీ లేని సంస్థతో విచారణ జరపాలని కోర్టును కోరారు. అయితే, కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి జగన్ సహకరించడం లేని ఏపీ ఏజీ కోర్టుకు విన్నవించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హమైనదో, కాదో రేపు హైకోర్టు తేల్చనుంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపి న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈనెల 12 నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను పున:ప్రారంభిస్తున్నారు. వచ్చే ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు పయనమవుతారు. కోడి కత్తి దాడితో జగన్కు గాయం కావడంతో ఆయన భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. భుజం గాయం తగ్గిన తర్వాత జగన్ మళ్లీ జనం బాట పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.