Home /News /politics /

HAVE NOT BEEN ON TALKING TERMS WITH SACHIN PILOT FOR 18 MONTHS SAYS RAJASTHAN CM ASHOK GEHLOT BA

Rajasthan Crisis | 18 నెలల నుంచి పైలట్‌తో మాటల్లేవ్.. అశోక్ గెహ్లోత్

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్(Image:PTI)

సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం అయినా కూడా ఎప్పుడూ కనీసం ముఖ్యమంత్రి అయిన తనతో మాట్లాడలేదని అశోక్ గెహ్లోత్ చెప్పారు.

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో అసలు 18 నెలల నుంచి మాటల్లేవన్నారు. తమిద్దరి మధ్య అసలు ఒక్కసారి కూడా చర్చలు జరగలేదన్నారు. డిప్యూటీ సీఎం అయినా కూడా ఎప్పుడూ కనీసం ముఖ్యమంత్రితో మాట్లాడలేదని, ఏ అంశం మీద కూడా తన అభిప్రాయం తెలుసుకోలేదని చెప్పారు. ఒకవేళ అసమ్మతి ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో చర్చలు అనేవి ఉండాలి కదా అని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పినట్టు హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని రాసింది. ఒకవేళ సచిన్ పైలెట్ మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేసేందుకు ముందుకొస్తే ఓ ఆత్మీయ ఆలింగనం ఇచ్చి స్వాగతిస్తానన్నారు. ‘నేను మొదటి సారి ఎంపీ అయినప్పుడు అతడు మూడేళ్ల పిల్లాడు. సచిన్ పైలెట్ కుటుంబంతో నాకు కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. అతడిని నేను ఆత్మీయ ఆలింగనంతో స్వాగతిస్తా’ అని రాజస్థాన్ సీఎం చెప్పారు. జూన్ 10వ తేదీనే సచిన్ పైలెట్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలసి వెళ్లిపోవాలనుకున్నారని, కానీ తానే చొరవ తీసుకుని వారికి నచ్చజెప్పానన్నారు. ‘రాత్రి 2 గంటలకు వాళ్లు వెళ్లిపోవాలనుకున్నారు. నేను నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. రాత్రి 1 గంటకి నిద్రలేచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడా. అందరు నేతలకూ ఫోన్లు చేసి వెంటనే అందరూ జైపూర్ రావాల్సిందిగా కోరా. దాదాపు అందరూ వచ్చేశారు. ఆ తర్వాత వీళ్లు ఇందులో కుట్ర ఏమీ లేదని చెప్పడం మొదలు పెట్టారు. కానీ, నా దగ్గర అప్పుడూ సాక్ష్యం ఉంది. ఇప్పుడూ ఉంది.’ అని అన్నారు. సచిన్ పైలెట్ బీజేపీలో చేరాలని అనుకున్నా.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా లేరన్నారు.

    rajasthan, rajasthan govt topple, rajasthan cm ashok gehlot, rajasthan news, rajasthan govt news, rajasthan bjp, rajasthan congress, rajasthan ashok gehlot, రాజస్థాన్, రాజస్తాన్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్,
    రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ మాణస్వీకారం. (File)


    మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ద్వారా కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింథియా గురించి కూడా అశోక్ గెహ్లోత్ స్పందించారు. ‘పార్టీకి ద్రోహం చెయ్యకూడదు. పార్టీ మీకు ఎన్నో ఇచ్చింది. నేను మూడు సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నా. మూడు సార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేశా. మూడుసార్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా. మూడుసార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నా. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నో కష్టాలు పడి పైకొచ్చా. మా జనరేషన్‌లో నేతలు ఎంతో కష్టపడ్డాం. పార్టీకి, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశాం. అందుకే ఈ రోజు ఈస్థాయిలో ఉన్నాం.’ అని గెహ్లోత్ అన్నారు.

    ashok gehlot, rajasthan chief minister ashok gehlot, rajasthan news, అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
    అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ (News18 Creative)


    మరోవైపు రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లోత్‌కు కొంచెం ఊరట లభించింది. ఇద్దరు ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లోత్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతును ప్రకటించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి వారు గెహ్లోత్‌కు బాసటగా నిలిచారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లోత్‌ను కలసి తమ మద్దతు లేఖను అందజేశారు. ఆ ఫొటోను ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో కలసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.’ అంటూ గెహ్లోత్ హిందీలో ట్వీట్ చేశారు.



    బీటీపీ రాజస్థాన్ చీఫ్ వెలరాం గోఘ్రా మాట్లాడుతూ తాము రాష్ట్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వాటిని వీలైనంత త్వరగా నెరవేర్చేందుకు ప్రభుత్వం, అధికారుల నుంచి హామీ వచ్చినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. కొన్ని రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వస్తే సభలో మద్దతిచ్చే అంశం కూడా పరిశీలిస్తామన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ashok Gehlet, Rajasthan, Sachin Pilot

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు