news18-telugu
Updated: October 24, 2019, 12:48 PM IST
హర్యానా ఎన్నికలపై News18 Creative
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండూ అధికారానికి సరిపడా సీట్లు రాలేదు. ఇప్పటి వరకు అందిన లీడ్స్ ప్రకారం.. మొత్తం 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 39 సీట్లు, కాంగ్రెస్ 30 సీట్లలో ముందంజలో ఉన్నాయి. జన్నాయక్ జనతా పార్టీ 10 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆ పది సీట్లతో రెండు పార్టీలకు షాక్ ఇచ్చాడు ఓ యువ నేత. అధికార బీజేపీకి మెజారిటీ రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడాన్ని కూడా అడ్డుకున్నాడు. ఇంతా చేస్తే.. అతడు కేవలం 31 ఏళ్ల యువ కెరటం. అతడి పేరు దుష్యంత్ సింగ్ చౌతాలా. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి వ్యవస్థాపకుడు.
హర్యానాలో పేరుగాంచిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచే ఈ దుష్యంత్ సింగ్ చౌతాలా వచ్చాడు. దుష్యంత్ తాత ఓమ్ ప్రకాష్ చౌతాలా హర్యానా మాజీ సీఎం. తండ్రి మాజీ ఎంపీ అజయ్ చౌతాలా. తల్లి నైనా సింగ్ చౌతాలా కూడా రాజకీయ నాయకురాలే.
అమెరికాలోని కాలిఫోర్నియాలో చదివాడు. నేషనల్ లా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందాడు. 2017లో మేఘనా చౌతాలతో దుష్యంత్ సింగ్ వివాహం జరిగింది.
ఒకప్పుడు దేశంలో అత్యంత తక్కువ వయసుగల ఎంపీగా రికార్డు దుష్యంత్ సింగ్ పేరిట ఉండేది. అయితే, 2018లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అతడిని బహిష్కరించింది. ఆ తర్వాత అతడే స్వయంగా జేజేపీని ఏర్పాటు చేశాడు. జింద్‌లో దుష్యంత్ సింగ్ నిర్వహించిన ఓ బహిరంగ సభకు సుమారు 6లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 1986లో ఆయన తాత దేవీలాల్ నిర్వహించిన సభకు కూడా ఇంతే సంఖ్యలో ప్రజలు హాజరుకావడం గుర్తించాల్సిన అంశం.
కుటుంబంలో వచ్చిన విబధాల కారణంగా ఓమ్ ప్రకాష్ చౌతాలా.. దుష్యంత్‌కు కాకుండా అభయ్కు మద్దతు పలికారు. ఆ తర్వాత ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్ బహిష్కరణకు గురయ్యాడు. కానీ, దేవీలాల్‌కు అసలైన వారసుడిగా ప్రజలు దుష్యంత్ సింగ్ చౌతాలకు పట్టంకట్టినట్టు కనిపిస్తోంది.
హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌లకు స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో దుష్యంత్ సింగ్ నేతృత్వంలోని జేజేపీ కీలకం కానుంది. రెండు పార్టీలతోనూ దుష్యంత్ సింగ్ చర్చలకు సుముఖంగా ఉన్నట్టు లీక్ చేశారు. ఎవరు తమకు సీఎం పదవి ఇస్తే వారితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 24, 2019, 12:48 PM IST